
సెక్షన్-8పై నో కామెంట్- ఉత్తమ్
ఓటుకు నోటు నేపథ్యంలో తెరపెకి వచ్చిన సెక్షన్ 8 గురించి వ్యాఖ్యలు చేయబోమని టీపీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్‌కుమార్ రెడ్డి అన్నారు.
- గ్రేటర్ వార్డు విభజనలో అక్రమాలు
- జోక్యం చేసుకోవాలంటూ ఈసీకి ఫోను
సాక్షి, హైదరాబాద్: ఓటుకు నోటు నేపథ్యంలో తెరపెకి వచ్చిన సెక్షన్ 8 గురించి వ్యాఖ్యలు చేయబోమని టీపీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్‌కుమార్ రెడ్డి అన్నారు. గాంధీభవన్‌లో బుధవారం మీడియాప్రతినిధులతో ఇష్టాగోష్ఠిగా ఆయన మాట్లాడుతూ గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల నేపథ్యంలో సెక్షన్ 8 వంటి సున్నితమైన అంశంపై మాట్లాడటం వల్ల రాజకీయ ఇబ్బందులు ఉంటాయని వ్యాఖ్యానించారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలకోసం జరుగుతున్న వార్డుల విభజనలో అక్రమాలు జరుగుతున్నాయని, జీహెచ్‌ఎంసీ అధికారులు ఏకపక్షంగా పనిచేస్తున్నారని ఆరోపించారు. గత ఎన్నికల్లో వచ్చిన ఓట్లను బట్టి తమకు అనుకూలంగా వార్డుల విభజన ప్రక్రియను టీఆర్‌ఎస్‌కు, ఎంఐఎం పార్టీల ప్రయోజనాలకు అనుగుణంగా విభజన చేస్తున్నారని ఆరోపించారు. వార్డుల విభజనకు జనాభా, భౌగోళిక ప్రాంతం వంటి ప్రాతిపదికలను అధికారులు పట్టించుకోవడం లేదని ఉత్తమ్ విమర్శించారు. వార్డుల విభజనలో అక్రమాలపై రాష్ట్ర ఎన్నికల సంఘం జోక్యం చేసుకోవాలని కోరారు. ఎన్నికల కమిషనర్ నాగిరెడ్డికి ఫోను చేసి ఫిర్యాదు చేసినట్టుగా చెప్పారు. గ్రేటర్ ఎన్నికలకోసం స్వచ్ఛహైదరాబాద్‌ను రాజకీయ కార్యక్రమంగా చేశారని ఆయన వ్యాఖ్యానించారు.
కేవలం ఫోటోలకు ఫోజులు ఇచ్చి, పెద్ద ఎత్తున ప్రచారం చేసుకుంటున్నారని ఆరోపించారు. ఎవరెన్ని కుట్రలు చేసినా గ్రేటర్ ఎన్నికల్లో పీఠాన్ని కైవసం చేసుకుంటామని ఉత్తమ్ ధీమాను వ్యక్తం చేశారు. ఇప్పటిదాకా హైదరాబాద్‌లో ముస్లిం ఓటర్లు ఎంఐఎంకు విశ్వాసంగా ఉన్నా, అధికారంలో టీఆర్‌ఎస్‌తో కుమ్మక్కు అయిందన్నారు. ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు, వక్ఫ్‌బోర్డుకు జ్యుడీషియల్ అథారిటీ, వక్ఫ్‌భూముల తిరిగి స్వాధీనం, ముస్లిం యువకులను ఎన్‌కౌంటర్ పేరిట కాల్చిచంపడం వంటి అంశాలపై ప్రజల్లో చర్చకు పెట్టగలిగామన్నారు. ఈ అంశాలపై ఎంఐఎంను, టీఆర్‌ఎస్‌ను ముస్లింలు అసహ్యించుకుంటున్నారని ఉత్తమ్ వివరించారు. ఏ ప్రాంతం వారైనా, ఏ భాషవారైనా హైదరాబాద్‌లో స్వేచ్చగా జీవించడానికి కాంగ్రెస్ కృషిచేస్తుందన్నారు.
సెటిలర్లకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందన్నారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో సన్నాహక సమావేశాలు 18 నియోజకవర్గాల్లో పూర్తయినాయని ఉత్తమ్ వెల్లడించారు. అనివార్య కారణాల వల్ల వాయిదాపడిన సికింద్రాబాద్, ఎల్బీనగర్, రాజేంద్రనగర్, కార్వాన్, గోషామహల్ నియోజకవర్గాల్లో ఈ నెల 30 లోగా పూర్తిచేస్తామని చెప్పారు. వీటిలో ఏఐసీసీ నేతలు కొప్పుల రాజు, ఆర్.సి.కుంతియా, టీపీసీసీ నేతలు పాల్గొంటారని చెప్పారు. 28న పీవీ వర్థంతి మాజీ ప్రధానమంత్రి పి.వి.నర్సింహ్మారావు వర్థంతి కార్యక్రమాన్ని ఈ నెల 28న గాంధీభవన్‌లో నిర్వహించనున్నట్టుగా టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి వెల్లడించారు. ఈ వర్థంతి కార్యక్రమంలో ఏఐసీసీ ప్రధానకార్యదర్శి దిగ్విజయ్‌సింగ్, సాక్షి ఎడిటోరియల్ డెరైక్టర్ కె.రామచంద్రమూర్తి పాల్గొంటున్నట్టుగా ఆయన తెలిపారు.