'మంత్రి పదవికి ఎవరు అడ్డుపడ్డారనేది..మాట్లాడను'
న్యూఢిల్లీ: హైదరాబాద్ లో శాంతి భద్రతల అంశంలో గవర్నర్‌కు అధికారాలివ్వడం అనుమానాలు కలిగించే విధంగా ఉన్నాయని సికింద్రాబాద్ ఎంపీ బండారు దత్తాత్రేయ అన్నారు. గవర్నర్ అధికారాలపై నెలకొన్న అనుమానాలు నివృత్తి చేయాలని హోంమంత్రిని కోరానని ఆయన తెలిపారు. యూపీఏ నిర్ణయాల వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని దత్తాత్రేయ విమర్శించారు.
గవర్నర్‌కు అధికారాలివ్వడంపై తొలుత బీజేపీనే ప్రశ్నించిందనే విషయాన్ని దత్తాత్రేయ గుర్తు చేశారు. అయితే తెలంగాణ బిల్లును అడ్డుకోవద్దని టీఆర్‌ఎస్ వాళ్లే మమ్మల్ని కోరడం వల్లనే తాము పూర్తి స్థాయిలో వ్యతిరేకించలేదని ఆయన అన్నారు.
నాకు మంత్రి పదవి రాకపోవడానికి కారణం...ఎవరనేదానిపై మాట్లాడదలచుకోలేదని దత్తాత్రేయ ఓ ప్రశ్నకు సమాధానమిచ్చారు. తెలంగాణలో సమగ్ర సర్వే నిర్వహించాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామన్నారు. బీసీల జనాభా ఎంత ఉందో సర్వేలో తేలుతుందని దత్తాత్రేయ మరో ప్రశ్నకు సమాధానమిచ్చారు.