కనిపించని శత్రువుతో కదనం.. | IAF Chopper Showers Petals On Gandhi Hospital | Sakshi
Sakshi News home page

కనిపించని శత్రువుతో కదనం.. వీరుడా వందనం!

Published Mon, May 4 2020 2:25 AM | Last Updated on Mon, May 4 2020 2:25 AM

IAF Chopper Showers Petals On Gandhi Hospital - Sakshi

ఆదివారం గాంధీ ఆస్పత్రిపై హెలికాప్టర్‌తో పూల వర్షం కురిపిస్తున్న వాయుసేన

సాక్షి, గాంధీ ఆస్పత్రి (హైదరాబాద్‌): కరోనా వైరస్‌తో అహర్నిశలు పోరాడుతున్న వైద్య సిబ్బందికి అత్యుత్తమ గౌరవం దక్కింది. ఆకాశం నుంచి వాయుసేన పూలవర్షం కురిపించగా, వైద్యసిబ్బంది ఆనందంతో ఉక్కిరి బిక్కిరి అయ్యారు. ఈ అద్భుత ఘటనకు వేది కైంది.. సికింద్రాబాద్‌ గాంధీ ఆస్పత్రి ప్రాంగణం. కరోనా నుంచి ప్రజలను కాపాడేందుకు వైద్యు లు, నర్సింగ్, పోలీస్, శానిటేషన్, పారా మెడికల్‌ సిబ్బంది ప్రాణాలకు తెగించి విధులు నిర్వహిస్తున్న విషయం విదితమే. వీరికి సంఘీభావం ప్రకటించి, నూతన ఉత్సాహం నింపాలని భారత త్రివిధ దళాల అధిపతి పిలుపునిచ్చారు. దీంతో ఆదివారం ఉదయం 10.23 గంటలకు గాంధీ ఆస్పత్రి ప్రాంగణంలో వైద్యసిబ్బందిపై వాయుసేన చేతక్‌ హెలికాప్టర్‌ పూలవర్షం కురిపించింది.

భారత సైనిక దళం, బ్యాండ్‌ వాయిస్తూ వైద్య సిబ్బందికి సెల్యూట్‌ చేసింది. ఈ కార్యక్రమంలో డీఎంఈ రమేశ్‌రెడ్డి, గాంధీ సూపరింటెండెంట్‌ ప్రొఫెసర్‌ రాజా రా వు, డిప్యూటీలు నర్సింహారావు నేత, శోభన్‌బాబు, టీజీజీడీఏ రాష్ట్ర అధ్యక్షుడు పల్లం ప్రవీణ్, గాంధీ యూనిట్‌ ప్రెసి డెంట్‌ సుబోధ్‌కుమార్‌తోపాటు అన్ని విభాగాలకు చెందిన హెచ్‌ఓడీలు, వైద్యులు, స్టాఫ్‌నర్సులు, శానిటేషన్, పారా మెడికల్, పోలీస్‌ సిబ్బంది పాల్గొన్నారు.  ‘అద్భుతమైన ఘట్టం ఆవిష్కృతమైంది. ప్రజల ఆరోగ్యం కోసం ప్రాణాలకు తెగించి సేవలు అందిస్తున్న అన్ని విభాగాలకు అసలైన గౌరవం దక్కింది’ అని నగర కమిషనర్‌ అంజనీ కుమార్‌ అన్నారు.

ఫీవర్‌ ఆస్పత్రిలో... 
సదరన్‌ స్టార్‌ ఆర్మీ వారియర్స్‌ ఆధ్వర్యంలో ఆదివారం నల్లకుంట ఫీవర్‌ ఆసుపత్రి వైద్యులు, సిబ్బందికి పూల వర్షంతో సంఘీభావం తెలిపారు. సారే జహాసే అచ్చా.. గీతాన్ని బ్యాండ్‌తో ఆలపించి వైద్యులు, సిబ్బందిపై పూలవర్షం కురిపించారు.

అరుదైన గౌరవం 
భారత త్రివిధ దళాలతో వందనం అందుకోవడం అరుదైన గౌరవం. రెట్టించిన ఉత్సాహంతో కరోనా వైరస్‌ను కట్టడి చేసేందుకు శాయశక్తులా కృషి చేస్తాం. త్రివిధ దళాల అధిపతులు, సైనికులతోపాటు దేశ ప్రధాని నరేంద్ర మోదీ, సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు.
– రాజారావు, గాంధీ సూపరింటెండెంట్‌  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement