మాట్లాడుతున్న సునీతమంగీలాల్
మహబూబాబాద్ రూరల్: టీడీపీ అధిష్టానం తనకు అవకాశమిస్తే మహబూబాబాద్ ఎంపీగా పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నానని టీడీపీ జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు భూక్యా సునీతమంగీలాల్ అన్నారు. టీడీపీ మహబూబాబాద్ జిల్లా కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సునీతమంగీలాల్ మాట్లాడారు. టీడీపీలోనే మహిళలకు సమాన గౌరవం, గుర్తింపు, ప్రత్యేకత దక్కిందన్నారు. అవకాశాలు ఎన్ని వచ్చినా పార్టీ మారకుండా 1990 నుంచి టీడీపీలోనే క్రియాశీలకంగా కొనసాగుతున్నానని తెలిపారు.
సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ట్రంలో ప్రతిపక్షం అనేది లేకుండా చేయాలనే దురుద్ధేశంతో ఎమ్మెల్యేలను అడ్డగోలుగా కొనుగోలు చేసి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని విమర్శించారు. పదవుల కోసం ఎన్నడూ పార్టీలు మారలేదని, మహిళలను ఆదరించి మంత్రి పదవులు ఇచ్చింది టీడీపీనేనన్నారు. అందరికీ అందుబాటులో ఉంటూ పార్టీ కోసం కష్టపడ్డ తనను అధిష్టానం గుర్తించి ఎంపీ టికెట్ ఇవ్వాలని కోరారు. తెలంగాణ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్.రమణ తనకు టికెట్ ఇచ్చే విషయంలో సానుకూలంగా స్పందించారని తెలిపారు.
ఏపీ సీఎం, టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు కూడా తనకు టికెట్ పట్ల సుముఖంగా ఉన్నారన్నారు. పార్టీ మొదటి నుంచి మహిళలకు ఇస్తున్న గుర్తింపులో భాగంగా ఇప్పుడు ఎంపీ టికెట్ టీడీపీ నుంచి తనకు కేటాయించాలని ఆమె కోరారు. ప్రజల్లో పార్టీ పట్ల నమ్మకం, అభిమానం ఉందని, ప్రజలు టీడీపీని ఆదరిస్తారన్నారు. ఈ సమావేశంలో టీడీపీ జిల్లా ఎస్టీ, ఎస్సీ సెల్ అధ్యక్షులు లూనావత్ హరికిషన్, గద్దల కృష్ణ, పార్టీ అర్బన్ అధ్యక్ష, కార్యదర్శులు దిడుగు సుబ్బారావు, కట్ల వెంకన్న, మైనార్టీ సెల్ రాష్ట్ర నాయకుడు ఇమామ్, డోర్నకల్ నియోజకవర్గ ఇన్‌చార్జి దరావత్ వెంకటేష్, జిల్లా అధికార ప్రతినిధి సుతారపు వెంకటనారాయణ, నాయకులు కటకం వెంకన్న, అన్వర్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment