అవకాశం వస్తే చిరంజీవితో సినిమా తీస్తా
వర్ధమాన దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల
భద్రాచలం : అవకాశం వస్తే చిరంజీవి 150వ సినిమాకు దర్శకత్వం వహిస్తానని వర్ధమాన దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల అన్నారు. భద్రాద్రి కళాభారతి ఆధ్వర్యంలో జరుగుతున్న నాటకోత్సవాలకు అతిథిగా విచ్చేసిన ఆయన విలేకరులతో మాట్లాడారు. చిరంజీవి సినిమాకు అవకాశం వస్తే అంతకంటే కావాల్సి ఏముందన్నారు. అందుకు తగ్గ కథ తనవద్ద ఉందన్నారు. దాసరి నారాయణరావు సినిమాలంటే ఎంతో ఇష్టమన్నారు. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, కొత్తబంగారు లోకం, ముకంద సినిమాలతో మంచి గుర్తింపు రావటం ఆనందంగా ఉందన్నారు.
దర్శకుడిగా రాణించటంలో తనకు ఎలాంటి బ్యాంక్ గ్రౌండ్ లేదని, భగవంతుడు కల్పించిన ఆలోచనతోనే ఈ రంగాన్ని ఎంచుకున్నానని తెలిపారు. కుటుంబ నేపథ్యం ఉన్న సినిమాలకే ప్రాధాన్యత ఉంటుందన్నారు. తన కొత్త ప్రాజెక్టుగా మహేష్‌బాబుతో ‘బ్రహ్మోత్సవం’ తీస్తున్నట్లు చెప్పారు. సినిమాకు సంబంధించిన ప్రాజెక్టు పూర్తయ్యిందని, త్వరలోనే కార్యరూపం దాల్చతామని అన్నారు. ఇంకా హీరోయిన్ ఎంపిక జరుగాల్సి ఉందన్నారు.