పట్టాలు అందుకున్న వేళ..
సరూర్‌నగర్: విద్యార్థుల్లో ఒక్కసారిగా ఆనందం తొణికిసలాడింది. పట్టాలు పుచ్చుకున్న వేళ ఎగిరి గెంతులేశారు. ఉల్లాసం ఉత్సాహంగా గడిపారు. ఫొటోలకు పోజులిచ్చారు. ఒకరినొకరు ఆప్యాయంగా పలుకరించుకున్నారు. ఇందుకు మీర్‌పేటలోని టీకేఆర్ ఇంజనీరింగ్ కళాశాల వేదికైంది. ఎంబీఏ, ఎంసీఏ, ఎంటెక్, ఎం-ఫార్మసీ కోర్సులు పూర్తి చేసిన టీకేఆర్ విద్యార్థులకు పట్టాల పంపిణీకి శనివారం ‘గ్రాడ్యుయేషన్ డే’ను నిర్వహించారు. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎంఎస్‌కే జైస్వాల్ హాజరై విద్యార్థులకు పట్టాలు పంపిణీ చేశారు.
టెక్నాలజీని దుర్వినియోగం చేయొద్దు..
దేశంలో వనరులకు కొదవ లేదని, మోడ్రన్ టెక్నాలజీని వినియోగించుకుని ప్రతి ఒక్కరూ ముందుకు సాగాలని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎంఎస్‌కే జైస్వాల్ సూచించారు. టెక్నాలజీని దుర్వినియోగం చేస్తే అది మన పతనానికి దారి తీస్తుందన్నారు. క్రమశిక్షణ, నైతికతను పాటిస్తూ సమాజానికి యువత నూతన వనరులుగా ఉపయోగపడాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో కళాశాల చైర్మన్, మహేశ్వరం ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి, కళాశాల కార్యదర్శి హరినాథ్‌రెడ్డి, కోశాధికారి అమర్‌నాథ్‌రెడ్డి, డెరైక్టర్లు ఎస్‌ఆర్ రామస్వామి, వరప్రసాద్‌రెడ్డి, ప్రిన్సిపాళ్లు రవిశంకర్, పి.రామ్మోహన్‌రావు, నర్సింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.