మహిళల ప్రగతి ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది. అతివల అభ్యున్నతికి అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతోంది. అత్యవసర పరిస్థితుల్లో ఆపద్భాంధవుడిలా చేయూతనందిస్తోంది. ఆడవాళ్ల కోసం ఐకేపీ ఆధ్వర్యంలో అనేక పథకాలు అమలు చేస్తూ అతివకు అభయమిస్తోంది. స్వయం సహాయక సంఘాల్లోని సభ్యులకు వర్తించే పథకాల ప్రయోజనాలు.. వాటి దరఖాస్తు విధానంపై సాక్షి కథనం.
* ఐకేపీ ఆధ్వర్యంలో అనేక పథకాలు
* లబ్ధి పొందితేనే ఆర్థిక ప్రగతి
జిల్లాలో మొత్తం 29,919 స్వయం సహాయ సంఘాలు ఉన్నాయి. ఇందులో 2,99,190 మంది సభ్యులుగా ఉన్నారు. ఐకేపీ అర్బన్‌లోని 7 మున్సిపాలిటీలో 7,019 స్వయం సహాయక సంఘాలు ఉండగా ఇందులో 70,190 మంది, ఐకేపీ రూరల్ పరిధిలో 22,919 సంఘాలు ఉండగా ఇందులో 2,29,000 మంది సభ్యులు ఉన్నారు. వీరికి వర్తించే పథకాలు ఇలా ఉన్నాయి.
బంగారుతల్లి పథకం
నానాటికి తగ్గిపోతున్న ఆడపిల్లల శాతం పెరగాలనే ఉద్దేశంతో 2013 జూలై 2 నుంచి ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం బంగారుతల్లి పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకం ప్రస్తుతం అమలులోనే ఉంది. 2013 మే 1 తర్వాత పుట్టిన ఆడబిడ్డలకు ఇది వర్తిస్తుంది. ఇద్దరు ఆడపిల్లల వరకే లబ్ధి చేకూరుతుంది. రెండో కాన్పులో ఇద్దరు ఆడపిల్లలు పుట్టినా అర్హులే.
తల్లి బిడ్డ ఫొటో, పుట్టిన తేదీ ధ్రువీకరణ పత్రం, బ్యాంకు ఖాతా పుస్తకం, ఆధార్‌కార్డు, యూఐడీ, తల్లి, తండ్రి రేషన్‌కార్డు పత్రాలతో సంబంధిత మండల సమాఖ్య కార్యాయాల్లోని ఏపీఎంకు దరఖాస్తు చేసుకోవాలి. ధ్రువీకరణ పత్రాలన్ని వాస్తమని నిర్ధారించిన తర్వాత వెబ్‌సైట్‌లో వివరాల్ని నమోదు చేస్తారు. తర్వాత బ్యాంకు ఖాతాల్లో నగదు జమ చేస్తారు.
ఆపన్నహస్తం
వికలాంగ మహిళలకు కూడా ఐకేపీ చేయూతనిస్తుంది. కాళ్లు చేతులు చచ్చుబడి ఎటూ కదల్లేని నిర్జీవ స్థితిలో ఉన్నవారికి మూడు చక్రాల సైకిళ్లు, దృష్టి వినికిడి లోపాలు ఉన్నవారికి వైకల్యానికి సంబంధించిన యంత్రాలు అందజేస్తారు. వైకల్యానికి అవసరమైన శస్త్ర చికిత్సలు నిర్వహించి ఇతరులతో పోటీపడేలా చూస్తున్నారు. వికలాంగులకు క్రీడలు నిర్వహించటం, వారిని ప్రతిభావంతులుగా తీర్చిదిద్దే కార్యక్రమాలు చేపడుతున్నారు. వికలాంగులతో స్వయం సహాయక సంఘాలు ఏర్పాటు చేయించి వారికి తక్కువ వడ్డీతో రుణ సదుపాయం క ల్పిస్తున్నారు.
స్త్రీ నిధి..కొండంత అండ
స్త్రీ నిధి పథకం అవసరాలకు పెన్నిధి లాంటిది. స్వయం సహాయ సంఘాల్లోని మహిళలకు కొండంత అండగా నిలుస్తుంది. అత్యవసర పరిస్థితుల్లో కూడా ఈ నిధి ద్వారా తక్షణ సహాయం పొందవచ్చు. బ్యాంకులకు వెళ్లే అవసరం లేకుండా సంఘం పని చేసే కార్యాలయం నుంచి దరఖాస్తు చేసుకోవచ్చు. వైద్యం, వివాహం, పిల్లల చదువులు తదితర అవసరాలకు రూ. 20 వేల వరకు రుణం అందజేస్తారు. సంఘంలో ఎంతమంది సభ్యులున్నా ఆరుగురు సభ్యులకు మాత్రమే రుణం అందుతుంది. ఈ రుణానికి పావలా వడ్డీ వర్తిస్తుంది.
బీమాతో పేదలకు ధీమా
ఐకేపీ ద్వారా నిరుపేదలు అధికంగా లబ్ధిపొందే పథకాల్లో బీమా పథకం ఒకటి. గ్రామీణ ప్రాంతాల్లోని నిరుపేదలు వేలకు వేలు కిస్తులు చెల్లించి ప్రత్యేకంగా బీమా చేయించుకోలేని పరిస్థితి. ఐకేపీలోని అభయహస్తం, ఆమ్‌ఆద్మీ యోజన, జనశ్రీబీమా పథకాలు ఎంతగానో ప్రయోజనం చేకూరుస్తున్నాయి. 18 నుంచి 59 ఏళ్ల వయస్సు ఉన్న వారికి ఈ పథకం కిందరూ.75 వేల వరకు బీమా చెల్లిస్తున్నారు.
ఇందుకు రూ.15 నుంచి రూ..100 వరకు ప్రీమియం చెల్లిస్తే వారు బీమాకు అర్హులవుతారు. సహజ మరణం అయినా, ప్రమాదంలో మృతి చెందినా ఈ బీమా వర్తిస్తుంది. ఇందుకోసం ప్రత్యేకంగా దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం ఉండదు. ఏపీఎంల ద్వారా సంఘ అధ్యక్షుల ద్వారా ప్రీమియం చెల్లిస్తే సరిపోతుంది.
అభయహస్తం
స్వయం సహాయక సంఘాల్లో సభ్యులైన వారు అభయహస్తంతో సభ్యత్వం ఉన్నవారు 60 ఏళ్లు నిండితే నెలకు రూ.500 చొప్పున పింఛన్ పొందవచ్చు. ఏటా ఒక్కో సభ్యురాలు వాటా ధనంగా రూ. 365 చెల్లించాల్సి ఉంటుంది. దీనికి ప్రభుత్వం మరో రూ. 365 చెల్లిస్తుంది. ఇలా పదేళ్ల పాటు వాటాధనం చెల్లిస్తే సభ్యురాలికి 60 ఏళ్లు దాటాకా నెలకు రూ. 500 చొప్పున గరిష్టంగా రూ. 2,200 వరకు పింఛన్ పొందవచ్చు.
వరుసగా రెండేళ్లపాటు వాటాధనం చెల్లించకుంటే సభ్యత్వం రద్దవుతుంది. సభ్యురాలు మరణిస్తే సహజ మరణానికి రూ.35వేలు, ప్రమాద మరణానికి రూ.75 వేలు, పాక్షిక ప్రమాదమైతే రూ.37,500 చొప్పున అందిస్తారు. సభ్యురాలు మృతి చెందితే దహన సంస్కారాల కింద రూ. 5 వేలు తక్షణ ఆర్థిక సహాయంగా అందజేస్తారు.
ఉపకార వేతనాలు
స్వయం సహాయక సంఘాల్లో సభ్యులై ఉండి బీమా ప్రీమియం చెల్లించిన సభ్యుల పిల్లలు చదువుతుంటే వారికి ఉపకార వేతనాల్ని అందజేస్తారు. తొమ్మిది, పది తరగతులతోపాటు ఇంటర్, ఐటీఐ చదువుకునే పిల్లలకు ఏడాదికి రూ.1200 చొప్పున ఉపకార వేతనాన్ని అందిస్తారు.
ఒక్కో సభ్యురాలి ఇంట్లో ఇద్దరు పిల్లలకు మాత్రమే ఉపకార వేతనం ఇస్తారు. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో చదివినా చాలు ఈ ఉపకార వేతనం అందుతుంది. వీటికోసం పిల్లలు చదువుతున్నట్లుగా పాఠశాల, కళాశాలలకు సంబంధించిన ధ్రువీకరణ పత్రాలతో మండల, అర్బన్ ఏపీఎం ద్వారా ఐకేపీ కార్యాలయం లేదా జిల్లా మహిళా సమాఖ్య కార్యాలయాల్లో సంప్రదించి దరఖాస్తు చేసుకోవచ్చు.
యువతుల కోసం..
నిరుద్యోగ యువతులు స్వయం సమృద్ధి సాధించేందుకు వివిధ కోర్సుల్లో ఉచితంగా శిక్షణ ఇస్తారు. ఎంప్లాయిమెంట్ జనరేషన్ మార్కెటింగ మిషన్ (ఈజీఎంఎం) పేరిట యువతకు కంప్యూటర్ సంబంధిత రంగాల్లో ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. ఇందుకోసం పదో తరగతి ఉత్తీర్ణులైన యవ తులు జిల్లా కేంద్రంలోని టీటీడీసీలో లేదా సంబంధిత మండల ఏపీఎంలను సంప్రదించి దరఖాస్తు చేసుకోవచ్చు. ఉచిత భోజనం, వసతితో కూడిన శిక్షణ ఇస్తారు. యువతీ యువకులు ఆర్థికంగా స్థిరపడేందుకు ఈ కార్యక్రమాలు ఎంతగానో దోహదపడుతున్నాయి.
వ్యవసాయంలోనూ..
రసాయనిక ఎరువుల వాడకంతో పెట్టుబడులు పెరిగి దిగుబడులు ఆశించిన మేరకు రాకపోవడం, గిట్టుబాటు ధరలు లేక ఆత్మహత్యకు పాల్పడుతున్న నేపథ్యంలో వాటిని తగ్గించే దిశగా ప్రోత్సహిస్తుంది. సేంద్రియ పద్ధతులపై మహిళా రైతులకు శిక్షణ, కూరగాయలు, ఇతరత్రా పంటల సాగుకు అవసరమైన సలహాలు, సూచనలు అందజేస్తారు. ఇందుకోసం ప్రతీ గ్రామానికి వీవోఏలను నియమించారు. వీరు సేంద్రియ ఎరువుల వాడకాన్ని తెలియజేయడంతో పాటు వాటి తయారీ విధానంపై రైతులకు అవగాహన కల్పిస్తున్నారు.
అతివకు అభయం
Published Sat, Jan 3 2015 4:54 AM | Last Updated on Sat, Sep 2 2017 7:07 PM
Advertisement
Advertisement