గెలుపు గుర్రాలకే ప్రాధాన్యం: పొన్నాల
సాక్షి, హైదరాబాద్: వచ్చే ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపికలో గెలుపు గుర్రాలకే ఎక్కువ ప్రాధాన్యమిస్తామని టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య చెప్పారు. పార్టీ ఎన్నికల కమిటీ, సీనియర్‌నేతల సమావేశం త్వరలోనే జరుగుతుందని, అభ్యర్థుల ఎంపిక పరిశీలన అనంతరం మొత్తం ప్రక్రియను ఈనెల 29 నాటికి పూర్తి చేస్తామని తెలిపారు. సామాజిక న్యాయం, సమర్థత, గెలుపు అవకాశాలను చూసి బడుగు బలహీనవర్గాలకు ప్రాధాన్యతనిస్తామని చెప్పారు. టీపీసీసీ కార్యాలయంలో బుధవారం తనను కలసిన మీడియాతో ఆయన ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ పార్టీలో అభ్యర్థుల ఎంపికకు డీసీసీల నుంచి వచ్చిన నివేదికలు ఒక్కటే ప్రాతిపదిక కాదని, ఆఫీసుబేరర్లు, ఇతర సీనియర్ నేతల నుంచి కూడా అభిప్రాయాలు తీసుకుంటున్నామని చెప్పారు.
ఇప్పటికే అనేకమంది నుంచి దరఖాస్తులు అందుతున్నాయని, వీటన్నిటినీ క్రోడీకరించి గెలుపే ప్రధానంగా అభ్యర్థిని నియమిస్తారని తెలిపారు. ఇంకా ఆయన ఏమన్నారంటే...
నేతల బంధువులో, కుటుంబాల్లోని వారో పోటీ చేయరాదనేది లేదు. వారిలో సమర్థత ఉంటే రాజకీయంగా పైకి రావడంలో తప్పులేదు. ప్రజాస్వామ్యంలో ఎవరికైనా రాజకీయంగా పోటీచేసే హక్కు ఉంటుంది.
2004,2009 ఎన్నికల్లో బీసీలకు ఇతర పార్టీలకన్నా కాంగ్రెస్సే ఎక్కువ సీట్లు ఇచ్చింది. ఉద్యమకారులు, వివిధవర్గాల జేఏసీలపై కాంగ్రెస్‌కు ఎంతో గౌరవం ఉంది. వారందరినీ ఈ ఎన్నికల్లో కలుపుకొని ముందుకు వెళ్తాం. పొత్తుల విషయంలో కాంగ్రెస్ పార్టీ తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయి. ఎంఐఎంతో అవగాహన పొత్తుల అంశంపై సరైన సమయంలో నిర్ణయం ఉంటుంది.
వచ్చేనెల మొదటి వారంలో ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ రాష్ట్రంలో ఎన్నికల ప్రచారానికి రానున్నారు. వరంగల్, ఆదిలాబాద్ జిల్లాల్లో కార్యక్రమాలుం టాయి. పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ కూడా పర్యటిస్తారు.
పార్టీ పరిస్థితిపై సర్వేలు చేయిస్తున్నాం. ఇందుకు సంబంధించిన బాధ్యతలను ప్రచారకమిటీ ఛైర్మన్ దామోదర రాజనర్సింహ చూస్తున్నారు. సర్వేల ఆధారంగా కూడా అభ్యర్థుల ఎంపికలు జరుగుతాయన్నారు.
టీఆర్‌ఎస్ ఇంటిపార్టీ, కాంగ్రెస్ జాతీయపార్టీ. దేశ, రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధి మా పార్టీవల్లనే సాధ్యం. కాంగ్రెస్‌పై అన్నివర్గాల్లో నమ్మకం ఉంది.