‘బడా’ దోపిడీ | in banswada peddagutta darga exploitation | Sakshi
Sakshi News home page

‘బడా’ దోపిడీ

Published Mon, Mar 17 2014 1:42 AM | Last Updated on Mon, Oct 8 2018 6:18 PM

‘బడా’ దోపిడీ - Sakshi

‘బడా’ దోపిడీ

పెద్దగుట్టలో కనీస సౌకర్యాలూ కరువేమూడు రాష్ట్రాల నుంచి భక్తులుసంపాదనే ధ్యేయంగా ముజావర్లు అడుగడుగునా పేరుకుపోయిన సమస్యలు
 
 దక్షిణ భారతదేశంలోనే ముస్లింల పవిత్ర దర్గాలలో ఇది ఒకటి. మన రాష్ట్రం నుంచే కాకుండా మహారాష్ర్ట, కర్ణాటక రాష్ట్రాల నుంచి కులమతాలకు అతీతంగా వేలాది మంది భక్తులు ఏడాది పొడవునా దర్గాను దర్శించుకుంటారు. మనసారా వేడుకుంటే కోరికలు నెరవేరుతాయని నమ్ముతా రు. ఇంతటి ప్రాధాన్యం కలిగిన ఈ దర్గా బాన్సువాడ నియోజకవర్గం వర్ని మండలంలో ఉంది. అయితే ఇక్కడకు వచ్చే భక్తులను ముజావర్లు (దర్గా పర్యవేక్షకులు) యథేచ్ఛగా దోచుకుంటున్నారు.  

 - బాన్సువాడ, న్యూస్‌లైన్
 
 దర్గా ముఖ ద్వారం
 
 బాన్సువాడ, న్యూస్‌లైన్:  వక్ఫ్ బోర్డు పరిధిలోకి వచ్చే బడాపహాడ్ అధికారులకు, నిర్వాహకులకు బంగారుబాతుగా మారింది. దర్గా నిర్వహణను ఏటా వేలం పాటల ద్వారా కాంట్రాక్టర్లకు అప్పగిస్తారు.
 
  ప్రతి ఏడాది సగటున సుమారు రూ. కోటి నుంచి రూ. రెండున్నర కోట్ల వరకు వేలం పాడి కాంట్రాక్టర్లు దీని నిర్వహణను దక్కించుకొంటారు. అక్కడి నుంచే దోపిడీ ప్రారంభమవుతుంది. అధికారులు బడాపహాడ్ ను కాంట్ట్రాక్టర్లకు అప్పగించి చేతులు దులుపుకొంటారు. కాంట్రాక్టర్ల నుంచి ముజావర్లు హక్కులు పొందుతారు. వారే దర్గాను పర్యవేక్షిస్తారు. దర్గా వద్ద  భక్తులకు ఇష్టం లేకపోయినా బలవంతంగా డబ్బులు తీసుకుంటారు. డబ్బులు ఇవ్వనివారిని దర్గా లోపలికి కూడా రానివ్వరు.
 
 న్యాజ్ (కందూరు) చేస్తే వివిధ రూపాలలో దాదాపు రెండు వేల రూపాయలు చెల్లించాల్సిందే. ఎవరైనా ముజావర్లను ప్రశ్నిస్తే, ‘‘పోలీసులకు, అధికారులకు ఫిర్యాదు చేసుకోండి, మాకేం కాదు’’ అం టూ నిర్భయంగా చెబుతారు. విడిది కోసం వినియోగించే పూరిగుడిసెలకు రోజుకు రూ. 100 నుంచి రూ. 500 వరకు వసూలు చేస్తారు.  వక్ఫ్‌బోర్డు అధికారులకు భక్తులు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకున్న దాఖలాలు లేవు.
 
 అంతులేని నిర్లక్ష్యం

 బడాపహాడ్‌కు వచ్చే భక్తులకు కనీస సౌకర్యాలు కల్పించడంలో వక్ఫ్‌బోర్డు అధికారులు, దర్గా నిర్వాహకులు నిర్యక్ష్యం చూపుతున్నా రు. ఏటా కోట్లాది రూపాయల ఆదాయం ఉన్నప్పటికీ అరకొర వసతులు మాత్రమే కల్పిస్తున్నారు.
 
  దీంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.భక్తుల విడిది కోసం విశ్రాంతి గృహా లు లేవు. స్నానం చేయడానికి నీటి వసతి లేదు. తాగడానికి సైతం నీరు లేదు. మూత్రశాలలు లేవు. దర్గాపై రోప్‌వే నిర్మించేందుకు ప్రతిపాదనలు చేసినా అవి కనుమరుగయ్యాయి.
 
 
 రహదారి అధ్వానం
 బడాపహాడ్ పుణ్యక్షేత్రానికి వెళ్లే రహదారి అధ్వానంగా మారింది. ఏళ్ల తరబడి మరమ్మతులకు నోచుకోకపోవడంతో ద్విచక్రవాహనచోదకులు సైతం వెళ్లలేని స్థితికి చేరుకుంది. బీటీ కాస్తా మట్టి రోడ్డుగా మారిపోయింది.
 
  పెద్ద పెద్ద గుంతలు, కంకర తేలి, వర్షానికి కొట్టుకుపోయిన రోడ్డుపై ప్రయాణం భక్తుల సహనాన్ని పరీక్షిస్తోంది. ఎంతో ప్రత్యేకత సంతరించున్న ఈ పుణ్య క్షేత్రంపై ప్రభుత్వధికారులు మాత్రం ఎప్పటికీ శీతకన్నే ప్రదర్శిస్తున్నారు. జాకో రా, కూనిపూర్, వెంకటేశ్వర క్యాంపు, జలాల్ పూర్  గ్రామాల వద ్ద మురికి నీరు రోడ్డుపైన ప్రవహిస్తోంది.  
 
 దోపిడీని అరికట్టాలి
 బడాపహాడ్‌లో భక్తులను దోచుకోవడమే ధ్యేయంగా కొందరు ముఠాగా ఏర్పడ్డారు. కాంట్ట్రాక్టు అమర్ అనే వ్యక్తి పేరుపై ఉండగా, అతనితో సంబంధం లేని ఆరుగురు వ్యక్తులు దర్గాలో ఉన్నారు. భక్తులు వస్తే వారి నుంచి బలవంతంగా డబ్బులు తీసుకొంటున్నారు. దర్శనం చేయనివ్వడం లేదు. దీంతో భక్తులు తీవ్ర అవస్థల పాలవుతున్నారు. వీరిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం.  
 -షేక్ జమీల్, ఆర్మూర్
 
 చర్యలు తీసుకుంటాం
 బడాపహాడ్‌లో కొందరు భక్తులను దోచుకొంటున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. వారిపై చర్యలు తీసుకొంటాం. నిబంధనల మేరకే డబ్బులు తీసుకోవాలి. దర్గా వద్ద మౌలిక వసతుల కల్పన కోసం కోట్ల రూపాయలతో ప్రతిపాదనలు చేశాం. త్వరలో అభివద్ధి పనులు ప్రారంభమవుతాయి.
 - జావీద్ అక్రం, వక్ఫ్ బోర్డు జిల్లా అధ్యక్షుడు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement