
గోల్కొండలో జెండా పండుగ..!
* పూర్వ వైభవానికి మువ్వన్నెల శోభ
* పరేడ్‌గ్రౌండ్స్‌కు బదులుగా కోటలో స్వాతంత్య్ర దినోత్సవం
* నేడు ఏర్పాట్లను చూడనున్న సీఎస్, డీజీపీ, కొత్వాల్
* శకటాలు తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించాలి
* సీఎం కేసీఆర్ వినూత్న ఆలోచన
సాక్షి, హైదరాబాద్: చారిత్రక గోల్కొండ కోటలో స్వాతంత్య్ర దినోత్సవాలను నిర్వహించాలని తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు నిర్ణయించారు. ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ, డీజీపీ అనురాగ్‌శర్మ, నగర పోలీసు కమిషనర్ మహేందర్‌రెడ్డిలను ఆదేశించారు. సోమవారం ఉదయం వీరు చారిత్రక గోల్కొండ కోటలో ఏర్పాట్లను పరిశీలించనున్నారు.
ఢిల్లీలో ఎర్రకోటలో స్వాతంత్య్ర దినోత్సవాలు నిర్వహిస్తున్న మాదిరిగానే.. హైదరాబాద్‌కు ప్రఖ్యాతి తెచ్చిన గోల్కొండ కోటలో నిర్వహిస్తే ఎలా ఉంటుందన్న దానిపై మేధావుల సూచనలు, సలహాలను కూడా ముఖ్యమంత్రి కోరారు. గోల్కొండ కోటపై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించడం ఓ చారిత్రాత్మక సన్నివేశంగా అభివర్ణిస్తున్నారు. అదే విధంగా తెలంగాణ రాష్ట్రంలో మొదటిసారి జరుగనున్న స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో ఏర్పాటు చేసే శకటాలన్నీ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించాలని కూడా ఆయన అధికారులను ఆదేశించారు.
స్వాతంత్య్రదినోత్సవాలను రాష్ట్రం ఏర్పాటైనప్పటి నుంచి పరేడ్‌గ్రౌండ్స్‌లో నిర్వహిస్తున్న సంగతి విదితమే. అయితే ఈసారి అందుకు భిన్నంగా ముఖ్యమంత్రి పాతబస్తీ ప్రాంతంలో ఈ వేడుకలను ఘనంగా నిర్వహించాలని నిర్ణయించారు. తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించే విధంగా వే డుకలు నిర్వహించాలన్న ఆలోచన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. అయితే గోల్కొండ కోటకు వెళ్లే..రహదారి ఇరుకుగా ఉన్నందున..శకటాలు వెళ్లడానికి ఏ విధంగా ఏర్పాట్లు చేయాలన్న దానిపై అధికారులు దృష్టిపెట్టనున్నారు. శకటాల ప్రదర్శనలో ప్రధానంగా బతుకమ్మ, బోనాలతోపాటు చారిత్రాత్మక కట్టడాలను ప్రదర్శించేలా చర్యలు తీసుకోనున్నారు.