గోల్కొండ కోటపైనే పంద్రాగస్టు
* పునరుద్ఘాటించిన సీఎం కేసీఆర్.. స్థల పరిశీలన
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో జరగనున్న తొలి స్వాతంత్య్ర దినోత్సవాన్ని చరిత్రాత్మక గోల్కొండ కోటలోనే నిర్వహించనున్నట్లు సీఎం కేసీఆర్ పునరుద్ఘాటించారు. కోటలో రాణిమహల్ సమీపంలోని తారామతి మసీదు పైభాగం, బాలా-ఈ-హిస్సార్ కింది భాగం మధ్య ఉన్న ప్రాంతంలో పతాకావిష్కరణ చేయాలని నిర్ణయించారు. కోట లోపలే స్వాతంత్య్ర వేడుకలను నిర్వహించడంతో పాటు అక్కడే పోలీసు గౌరవ వందనం స్వీకరించాలనే అభిప్రాయానికి వచ్చారు.
సోమవారం ఆయన మండలి చైర్మన్ స్వామిగౌడ్, స్పీకర్ మధుసూదనాచారి, విద్యాశాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి, నగర మేయర్ మాజిద్ హుస్సేన్, ప్రభుత్వ సలహాదారు పాపారావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ, డీజీపీ అనురాగ్ శర్మ, పోలీస్ కమిషనర్ మహేందర్‌రెడ్డి, హైదరాబాద్ జిల్లా కలెక్టర్ ఎంకే మీనాలతో కలిసి గోల్కొండ కోట, చుట్టుపక్కల ప్రాంతాలను 2 గంటల పాటు పరిశీలించారు. కోట లోపల కలియ తిరిగి పతాకావిష్కరణకు అనువైన స్థలాన్ని ఎంపిక చేశారు. తారామతి మసీదు ఎదురుగా ఉన్న విశాలమైన పచ్చిక బయలులో ఆహ్వానితులను కూర్చోపెట్టాలని సూచించారు.
పతాకావిష్కరణ చేసే ప్రాంతంలో చుట్టుపక్కల బురుజులు, ఎత్తై కట్టడాలపై తెలంగాణ కళారూపాలు ప్రదర్శించాలని కేసీఆర్ ఈ సందర్భంగా సూచించారు. పోలీసు కవాతు, శకటాల ప్రదర్శన తదితర కార్యక్రమాల నిర్వహణకు మరో విశాల ప్రాంతం కావాల్సి ఉండటంతో పక్కనే ఉన్న ‘18 చిడిలు’గా పిలిచే ప్రాంతాన్ని పరిశీలించారు. స్వాతంత్య్ర, గణతంత్ర దినోత్సవాలు, ఇతర రాష్ట్ర పండుగలు గోల్కొండ కోటలోనే ఘనంగా నిర్వహించేలా శాశ్వత ప్రాతిపదికన చర్యలకు ఆయన ఆదేశాలిచ్చారు. తెలంగాణ సంస్కృతి ప్రతిబింబించేలా ఉత్సవం జరగాలని సీఎం ఆకాంక్షించారు.