తొలిరోజే ఇద్దరు డిబార్
⇒ ప్రశాంతంగా ఇంటర్ పరీక్షలు ప్రారంభం
⇒ పలు కేంద్రాలను తనిఖీ చేసిన అధికారులు
⇒ ఆలస్యంగా వచ్చి వెనుగిరిగిన కొందరు విద్యార్థులు
నిజామాబాద్ అర్బన్ :ఇంటర్ పరీక్షలు జిల్లావ్యాప్తంగా సోమవారం ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. జిల్లా కేంద్రంలోని కాకతీయ, ఎస్‌ఎస్‌ఆర్ కళాశాల కేంద్రాలను జేసీ రవీందర్‌రెడ్డి తనిఖీ చేశారు. చిట్టిమిల్ల హరిప్రసాద్ కళాశాల కేంద్రంలో ఇద్దరు విద్యార్థులు డిబార్ అయ్యారు.
మాస్ కాపీయింగ్‌కు పాల్పడుతుండగా స్క్వాడ్ అధికారులు వారిని పట్టుకున్నారు. 45 నిమిషాలు ముందుగానే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని అధికారులు సూచించినా, కొన్ని చోట్ల విద్యార్థులు ఆలస్యంగా వచ్చారు. కాకతీయ జూనియర్ కళాశాల లో ఇద్దరు ఆలస్యంగా రావడంతో అధికారులు అనుమతించలేదు. దీంతో వారు వెనుదిరిగారు. ఖలీల్‌వాడిలోని ఎస్‌ఎస్‌ఆర్ పరీక్ష కేంద్రానికి చెందిన ఓ ఇన్విజిలేటర్ 9.40 నిమిషాలకు పరీక్ష కేంద్రానికి వచ్చారు. అధికారులు ఆయననూ అనుమతించలేదు. సమాచారం ఆలస్యంగా ఇచ్చారని తెలిపినా, నిరాకరించారు. మొదటి రోజు పరీక్షలకు 2,121 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. మంగళవారం ద్వితీయ ఇంటర్ పరీక్షలు మొదలవుతాయి.