సంగారెడ్డిలో దసరా నాడు నిర్వహించనున్న ఉత్సవాలు తీవ్ర వివాదాన్ని రేకెత్తిస్తోంది.
సంగారెడ్డి మున్సిపాలిటీ: సంగారెడ్డిలో దసరా నాడు నిర్వహించనున్న ఉత్సవాలు తీవ్ర వివాదాన్ని రేకెత్తిస్తోంది. ఉత్సవాలకు రాజకీయ విభేదాలు కూడా తోడవుతున్నాయి. స్థానిక ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ ఆధ్వర్యంలో దసరా ఉత్సవాలు నిర్వహిస్తామని ప్రకటించిన వీహెచ్‌పీ జిల్లా అధ్యక్షుడు ప్రభాకర్‌పై వివిధ విభాగాల అధ్యక్షులు, ప్రముఖులు నిరసన వ్యక్తం చేశారు. 25 ఏళ్లుగా వస్తున్న సంప్రదాయాన్ని కాదని ఎమ్మెల్యేను ముఖ్యఅతిథిగా పిలవడం ఎంత వరకు సమంజసమని వారు ప్రశ్నించారు.
రాంమందిర్ ఉత్సవ కమిటీ, భవానీమందిర్ యువసేన కమిటీ సభ్యుల సూచన మేరకు ఉత్సవాలు నిర్వహిస్తామని తెలిపినప్పటికీ వీహెచ్‌పీ నాయకులు ముఖ్య అతిధిగా ఎమ్మెల్యేను ఎలా ఆహ్వానిస్తారని ప్రశ్నించారు. టీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో ఉత్సవాలు నిర్వహిస్తే మాత్రం సహించేది లేదన్నారు. దసరా ఉత్సవ కమిటీ నిర్వహించే దసరా వేడుకలకు మున్సిపల్ చైర్‌పర్సన్ అధ్యక్షత వహిస్తారని, ఎమ్మెల్యే నియోజకవర్గానికి ప్రజాప్రతినిధి అయినందున ప్రత్యేక అతిథిగా ఆహ్వానిస్తామంటే తమకు అభ్యంతరం లేదన్నారు. వారంరోజులుగా దసరా ఉత్సవాలపై వివిధ పార్టీల నాయకులు చేస్తున్న విభిన్న ప్రకటనలతో దుమారం నెలకొంది.
ఈ నేపథ్యంలో సోమవారం వీహెచ్‌పీ జిల్లా అధ్యక్షుడు ప్రభాకర్, ప్రధాన కార్యదర్శి దత్తాత్రేయ చౌహాన్ సమక్షంలో సమావేశం నిర్వహించారు. సమావేశంలో టీఆర్‌ఎస్ నేతలు చేస్తున్న ప్రచారాన్ని ఖండించాల్సిన అవసరం ఉందన్నారు. ఎమ్మెల్యేగా ఉత్సవాలకు సహాయం చేస్తే తాము కాదమని, టీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో ఉత్సవాలు నిర్వహిస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని వారు హెచ్చరించారు. ఈ క్రమంలో నాయకులకు, కార్యకర్తలకు మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదం జరిగింది.
చివరకు దసరా ఉత్సవాలను మున్సిపల్ చైర్‌పర్సన్ అధ్యక్షతన నిర్వహిస్తామని, ఉత్స వాలకు ఎమ్మెల్యేను కూడా ఆహ్వానిస్తామని వారు పేర్కొన్నారు. ఎప్పటిలాగే రాంమందిర్ నుంచి శావాను ఊరేగింపుగా తీసుకువస్తామని ఉత్సవాన్ని రాజకీయాలకు అతీతంగా, గతంలో మాదిరిగా వైభవంగా నిర్వహిస్తామని వారు పేర్కొన్నారు.