
తెలంగాణలో రూ. 8 వేల కోట్ల పెట్టుబడులు: ఐటీసీ
తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు శుక్రవారం ప్రకటించిన పారిశ్రామిక విధానానికి భారీ స్పందన వచ్చింది. ముఖ్యంగా ఐటిసీ కంపెనీ ఖమ్మం, మెదక్ జిల్లాల్లో పెట్టుబడులు పెట్టేందుకు సంసిద్ధతను వ్యక్తం చేసింది.
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు శుక్రవారం ప్రకటించిన పారిశ్రామిక విధానానికి భారీ స్పందన వచ్చింది. ముఖ్యంగా ఐటిసీ కంపెనీ ఖమ్మం, మెదక్ జిల్లాల్లో పెట్టుబడులు పెట్టేందుకు సంసిద్ధతను వ్యక్తం చేసింది. తెలంగాణ రాష్ట్రంలో తమ పెట్టుబడుల వివరాలను కంపెనీ ఛైర్మన్ వై.సి. దేవేశ్వర్ శుక్రవారం వెల్లడించారు. దాదాపు రూ. 8 వేల కోట్లతో వివిధ ప్రాంతాల్లో తమ కంపెనీని విస్తరించనున్నట్టు తెలిపారు. ముఖ్యంగా ఖమ్మం జిల్లా భద్రాచలంలో పేపర్ బోర్డు ప్లాంట్ విస్తరణకు రంగం సిద్ధం చేశామన్నారు. మెదక్ లో రూ. 800 కోట్లతో ఫుడ్ ప్రాసెసింగ్ సెంటర్ను నెలకొల్పనున్నట్లు ప్రకటించారు. మరో వెయ్యి కోట్లను వెచ్చించి తమ రెండో ఐటీసీ హోటల్ను మెదక్లో ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు.
హెచ్ఐసీసీలో శుక్రవారం టీఆర్ఎస్ ప్రభుత్వం టీఐ పాస్ను ఆవిష్కరించిన నేపథ్యంలో రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు దేశ విదేశీ కంపెనీలు ఆసక్తిని ప్రదర్శించాయి. పారిశ్రామిక వేత్తలు, కంపెనీల సీఈవోలతో జరిగిన ఈసమావేశంలో మైక్రోసాఫ్ట్, టాటా, ఐటీసీ, ఇన్ఫోసిస్ తదితర కంపెనీలు పాల్గొన్నాయి. అమెరికా, కెనడా, స్వీడన్, గల్ప్ దేశాలకు చెందిన విదేశాంగ రాయబారులు హాజరయ్యారు.