వాటీజ్ దిస్
డీఆర్‌ఓపై జేసీ రజత్‌కుమార్ చిర్రుబుర్రు
►కలెక్టరేట్‌లో పోస్టర్లు, గోడరాతలపై గరం
►సాయంత్రం వేళ ఆకస్మిక తనిఖీ
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి : ‘వాటీజ్ దిస్. ఎన్నిసార్లు చెప్పాలండీ. గోడలపై ఈ రాతలేమిటీ? అడ్డదిడ్డంగా ఆ వాహనాల పార్కింగే ంటీ? మెయిన్ గేట్ ముందు బోర్డు ఏర్పాటు చేయాలని చెప్పాగా, ఇప్పటివరకు ఎందుకు చేయలేదు. ఐయామ్ సారీ. మీ పద్ధతి బాగాలేదండి’ అని జాయింట్ కలెక్టర్-1 రజత్‌కుమార్ సైనీ మంగళవారం జిల్లా రెవెన్యూ అధికారి సూర్యారావుపై చిర్రుబుర్రులాడారు. సాయంత్రం వేళ ఆకస్మికంగా కలెక్టరేట్ ఆవరణను పరిశీలించిన జేసీ.. పరిశుభ్రత పాటించకపోవడంపై డీఆర్‌ఓ సహా ‘బీ’సెక్షన్ సూపరింటెండెంట్ నర్సింహరావుకు క్లాస్ తీసుకున్నారు.
గోడలపై కార్యాలయాల పేర్లు ఉండడం, ప్రధాన గేటు ముందర అటవీ వస్తువుల విక్రయానికి సంబంధించిన ఫ్లెక్సీలు ఉండడంపై అసంతృప్తి వ్యక్తం చేసిన ఆయన.. ‘స్నేహా’ బిల్డింగ్ గ్రౌండ్‌ఫ్లోర్‌లో తుప్పుపట్టిన వాటిని ఇంకా తొలిగించకపోవడంపై చిరాకు పడ్డారు. కొత్త బోర్డు ఏర్పాటు చేయమని ఎన్నిసార్లు చెప్పాలండీ. ఎందుకు ఆలస్యం చేస్తున్నారో నాకర్థం కావడంలేదని పెదవివిరిచారు.