జేడీఏ ‘పదవి’పై ఉత్కంఠ | JDP Ministership up on suspence | Sakshi
Sakshi News home page

జేడీఏ ‘పదవి’పై ఉత్కంఠ

Published Fri, May 1 2015 2:50 AM | Last Updated on Sun, Sep 3 2017 1:10 AM

JDP Ministership up on suspence

ఖమ్మం వ్యవసాయం : ఖమ్మం సంయుక్త వ్యవసాయ సంచాలకులుగా పూర్తి అదనపు బాధ్యతలతో పని చేస్తున్న పీ.బీ భాస్కర్‌రావు పదవీకాలంపై ఉత్కంఠ నెలకొంది. గురువారం (ఏప్రిల్ 30)తో ఆయన పదవీకాలం ముగుస్తుంది. అయితే ప్రభుత్వం ఆస్థానాన్ని ఎవరితో భర్తీ చేస్తుందనే అంశం ఆసక్తి రేపుతోంది. వాస్తవానికి పీబీ భాస్కర్‌రావు రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ రైతు శిక్షణ కేంద్రం ఉపసంచాలకులు. 2013లో ఇక్కడ పని చేస్తున్న రఫీక్ అహ్మద్ హైదరాబాద్‌కు బదిలీ కావటంతో కొంతకాలం వరంగల్ జేడీఏ నాగేశ్వరరావు అదనపు బాధ్యతలు నిర్వహించారు. 2013 జూన్‌లో రాజేంద్రనగర్‌లో పని చేస్తున్న పీబీ భాస్కర్‌రావుకు ఖమ్మం జేడీఏగా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించి పంపారు.

అప్పటి నుంచి రెగ్యులర్ అధికారిని నియమించలేదు. ఈయనే బాధ్యతలు నిర్వహించారు. ఈయన పదవీ కాలం పూర్తయినా ఇన్‌చార్జి బాధ్యతలు కూడా ఎవరికి అప్పగించాలో రాష్ట్ర కమిషనరేట్ నుంచి బుధవారం రాత్రి పొద్దుపోయే వరకు సమాచారం లేదు. ప్రస్తుతం ఇక్కడ పని చేస్తున్న పి.బి భాస్కర్‌రావు రాజేంద్రనగ్ రైతు శిక్షణ కేంద్రం ఉప సంచాలకులుగా పదవీ విరమణ పొందాల్సి ఉంది. బుధవారం రాత్రి వరకు రాష్ట్ర కమిషనర్ కార్యాలయం నుంచి ఎటువంటి ఉత్తర్వులు రాక పోవటంతో ప్రభుత్వం ఆ స్థానాన్ని ఎవరితో భర్తీ చేస్తుందోనని, లేదా ఎవరికైనా అదనపు బాధ్యతలు అప్పగిస్తుందా అనేది చర్చనీయాంశంగా మారింది.

జేడీఏ పదవి ఎవరిని వరించనుంది..!
ప్రస్తుతం ఖమ్మం వ్యవసాయ శాఖలో రైతు శిక్షణ కేంద్రం ఉపసంచాలకులుగా పని చేస్తున్న ఎం. రత్నమంజుల రాష్ట్ర విభజనలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆప్షన్ పెట్టుకున్నారు. మరో ఉపసంచాలకులు ఆశాకుమారి జిల్లాలోని ఆత్మ డిప్యూటి ప్రాజెక్టు డెరైక్టర్‌గా పని చేస్తున్నారు. రఫీక్‌అహ్మద్ కంటే ముందు ఆశాకుమారికి జేడీఏ ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగించారు. ఆమెకు ఈ బాధ్యతలు భారం కావటంతో ఆ తర్వాత తప్పించారు. ప్రస్తుతం జిల్లాలో ఉపసంచాలకులుగా పని చేస్తున్న అధికారి ఆశాకుమారి కావటంతో ఈ సారి కూడా ఆమెకు బాధ్యతలు అప్పగించే అవకాశం ఉన్నట్లు చర్చ జరుగుతోంది. రాష్ట్ర ప్రభుత్వం నూతన అధికారిని జేడీఏగా నియమిస్తూ గురువారం ఉత్తర్వులు జారీ చేస్తుందా? లేదా? అనేది ఉత్కంఠగా మారింది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement