సాక్షి, హైదరాబాద్: ఎన్‌ఐటీ, ట్రిపుల్ ఐటీ, ఇతర ప్రభుత్వ ఆర్థిక సహకారంతో నడిచే జాతీయస్థాయి విద్యా సంస్థల్లో (జీఎఫ్‌టీఐ) ప్రవేశాల కోసం నిర్వహించే జేఈఈ మెయిన్–2018 పరీక్షకు సంబంధించిన నోటిఫికేషన్‌ను వచ్చే నెలాఖర్లో విడుదల చేసేందుకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్‌ఈ) ఏర్పాట్లు చేస్తోంది. డిసెంబర్ 1 నుంచి లేదా ఆ తరువాత విద్యార్థుల రిజిస్ట్రేషన్‌ను ప్రారంభించనుంది. ఈ పరీక్షకు ముందుగానే విద్యార్థులు ఆధార్‌ను సమకూర్చుకోవాలని స్పష్టం చేసింది. 2018 విద్యా సంవత్సరం నుంచి ఒకే ఇంజనీరింగ్ పరీక్ష ద్వారా జాతీయ స్థాయిలో అన్ని కాలేజీల్లో ప్రవేశాలు చేపట్టాలని భావించిన కేంద్రం ఈసారికి ఆ ఆలోచనను విరమించుకుంది.
జేఈఈ మెయిన్ ద్వారానే ఎన్‌ఐటీ, ట్రిపుల్ ఐటీ, జీఎఫ్‌టీఐలలో ప్రవేశాలు చేపట్టాలని నిర్ణయించింది. అలాగే ఐఐటీల్లో ప్రవేశాలకు జేఈఈ అడ్వాన్స్‌డ్‌ను నిర్వహించేందుకు ఐఐటీల కౌన్సిల్ నిర్ణయించి కాన్పూర్ ఐఐటీకి ఆ బాధ్యత అప్పగించింది. జేఈఈ మెయిన్‌లో అర్హత సాధించిన టాప్ 2.21 లక్షల మందిని 2017లో జేఈఈ అడ్వాన్స్‌డ్ రాసేందుకు అర్హులుగా పరిగణనలోకి తీసుకోగా 2018 విద్యా సంవత్సరంలో 2.24 లక్షల మందిని జేఈఈ అడ్వాన్స్‌డ్ రాసేందుకు అర్హులుగా పరిగణనలోకి తీసుకోవాలని నిర్ణయించింది.
Comments
Please login to add a commentAdd a comment