హెచ్చార్సీకి సత్యం తండ్రి ఫిర్యాదు
సాక్షి, హైదరాబాద్: ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి ఎన్నికల అఫిడవిట్‌లో దుబాయ్‌లో తనపై నమోదైన కేసుల గురించి ప్రస్తావించలేదని చేసిన ఫిర్యాదు నేపథ్యంలో కక్షగట్టి తన కొడుకు తలారి సత్యం ను హత్య చేయించారని సత్యం తండ్రి తలారి గంగాధర్ మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు శనివారం ఆయన తెలుగుదేశం నాయకుడు రాజారాం యాదవ్‌తో కలసి హెచ్‌ఆర్‌సీ చైర్మన్ జస్టిస్ నిస్సార్ అహ్మద్ కక్రూకు ఫిర్యాదును అందజేశారు. జనవరి 9న ఆర్మూర్ పట్టణంలోని అంబేడ్కర్ ఎక్స్‌రోడ్డు వద్ద బైక్‌పై వెళుతున్న తలారి సత్యం, చేపూరి రవిలు టిప్పర్ ఢీకొనడంతో చనిపోయారని..
అయితే ఇది ప్రమాదవశాత్తూ జరిగింది కాదని, పథకం ప్రకారమే ఈ హత్య చేశారని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. 2014 ఎన్నికల్లో ఆర్మూర్ నుంచి పోటీ చేసిన తలారి సత్యం.. తన ప్రత్యర్థి జీవన్‌రెడ్డి అఫిడవిట్‌లో యునెటైడ్ అరబ్ బ్యాంకులో రుణాన్ని ఎగవేసినందుకు అల్గర్బా స్టేషన్‌లో నమోదైన కేసు గురించి ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశారని తెలిపారు. దీనిపై తన కుమారుడిపై వచ్చిన బెదిరింపుల నేపథ్యంలో పోలీసులు, హెచ్‌ఆర్‌సీకి ఫిర్యాదు చేశాడని పేర్కొన్నారు. చివరికి జనవరిలో టిప్పర్‌తో ప్రమాదం జరిగినట్లు హత్య చేయించారని ఆరోపించారు. ఈ మేరకు కేసు నమోదైంది.