
రూ.7 కోట్ల పాత కరెన్సీ స్వాధీనం
రాజధానిలో కుప్పలుతెప్పలుగా పాత కరెన్సీ నోట్లు దొరుకుతున్నాయి. టాస్క్‌ఫోర్స్ పోలీసులు గత నెల రోజుల్లో రూ.4.53 కోట్లు పట్టుకున్నారు.
చిక్కింది జీవిత, రాజశేఖర్ ఇంటి పై పోర్షన్‌లో
సాక్షి, హైదరాబాద్: రాజధానిలో కుప్పలుతెప్పలుగా పాత కరెన్సీ నోట్లు దొరుకుతున్నాయి. టాస్క్‌ఫోర్స్ పోలీసులు గత నెల రోజుల్లో రూ.4.53 కోట్లు పట్టుకున్నారు. తాజాగా గురువారం సెంట్రల్ జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు మరో రూ.7 కోట్ల విలువైన పాత రూ.500, రూ.వెయ్యి నోట్లను స్వాధీనం చేసుకున్నారు. జూబ్లీహిల్స్ ప్రాంతంలో ఇద్దరు నిందితుల్ని అదుపులోకి తీసుకున్నారు. కూకట్‌పల్లి, పర్వత్‌నగర్ ప్రాంతాలకు చెందిన శ్రీనివాస్, పురుషోత్తం అనే వ్యక్తులు చెన్నైకి చెందిన సినీనిర్మాతకు సంబంధించిన ఓ బ్యానర్‌లో ప్రొడక్షన్ మేనేజర్లుగా పనిచేస్తున్నారు. ఈ బ్యానర్ కింద ప్రముఖ నటుడు రాజశేఖర్ కథానాయకుడిగా రూపొందుతున్న చిత్రానికి సంబంధించిన విధులు నిర్వర్తిస్తున్నారు. జూబ్లీహిల్స్‌లోని జీవిత, రాజశేఖర్ దంపతుల ఇంటి మొదటి అంతస్తులోని కొంత భాగంలో సదరు నిర్మాణ సంస్థ కార్యాలయం నెలకొల్పారు. అందులో శ్రీనివాస్, పురుషోత్తం ఉంటున్నారు.
ఆ నిర్మాత వీరికి పాత రూ.500, రూ.1000 డినామినేషన్‌తో ఉన్న రూ.7 కోట్ల కరెన్సీ అప్పగించాడు. నోట్ల రద్దు తర్వాత ఆదాయపుపన్ను శాఖకు భయపడి దాచిన ఈ నల్లధనాన్ని కమీషన్ పద్ధతిలో మార్పిడి చేయడానికి వీరితో ఒప్పందం కుదుర్చుకున్నాడు. భారీ మొత్తమైతే బ్యాంకు ద్వారా తేలిగ్గా మార్చవచ్చనే ఉద్దేశంతో నిందితులు అంగీకరించారు. రూ.లక్ష పాత నోట్లుకు రూ.10 వేలు కొత్త కరెన్సీ ఇచ్చేవిధంగా నిర్మాతతో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ మొత్తాన్ని రూ.లక్షకు రూ.20 వేల కొత్త కరెనీ వచ్చేలా మార్పిడి చేద్దామని నిందితులు భావించారు.
ఇలా చేయగా వచ్చే కమీషన్‌ను పంచుకోవాలని వారు నిర్ణయించుకున్నారు. దీనిపై సమాచారం అందుకున్న సెంట్రల్‌జోన్ టాస్క్‌ఫోర్స్ ఇన్‌స్పెక్టర్ ఎస్.శ్రీనివాస్‌రావు నేతృత్వంలోని బృందం ఆ ఇంటిపై దాడి చేసింది. ఆ ఇద్దరి నిందితులను అదుపులోకి తీసుకుని ఏడు కోట్ల రూపాయల విలువైన పాత కరెన్సీని స్వాధీనం చేసుకుంది. ఈ వ్యవహారంతో ఇంకా ఎవరికైనా సంబంధాలు ఉన్నాయా.. వీరికి పాత నోట్లు ఇచ్చిన ‘నల్లబాబులు’ ఇంకా ఎవరైనా ఉన్నారా.. అనే కోణాల్లో పోలీసులు విచారిస్తున్నారు. ఈ అంశంపై జీవిత స్పందించారు.
శ్రీనివాస్ అనే వ్యక్తి తన ఐదుగురు మేనేజర్లలో ఒకరని, ఈ వ్యవహారం అంతా తమ ఇంటిపై ఉన్న కార్యాలయంలో జరుగుతున్నట్లు వస్తున్న వార్తలు అవాస్తవమన్నారు. పట్టుబడ్డ మరో వ్యక్తి, పాతనోట్లకు తనకు, తమ సోదరుడికి ఎలాంటి సంబంధం లేదని ఆమె స్పష్టం చేశారు. ప్రస్తుతం తన సోదరుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడని వివరించారు.