సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఇష్టం వచ్చినప్పుడు కాలేజీలు, స్కూళ్లకు అనుమతులు, గుర్తింపులు తీసుకోవడం, ఇష్టం వచ్చినంత మందిని చేర్చుకొని తర్వాత అనుమతికి దరఖాస్తు చేసుకోవడం ఇకపై కుదరదని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి పేర్కొన్నారు. తాము ముందుగా ఇచ్చే నోటిఫికేషన్ ప్రకారం 2018 ఏప్రిల్ 30వ తేదీలోగా అన్ని విద్యా సంస్థలకు అనుబంధ గుర్తింపు, అనుమతుల ప్రక్రియను పూర్తి చేస్తామన్నారు. ఏప్రిల్ 20వ తేదీ తరువాత వచ్చే ఎలాంటి దరఖాస్తులను స్వీకరించేది లేదని స్పష్టం చేశారు.
జూన్ 1వ తేదీ నుంచి స్కూళ్లు, కాలేజీల్లో విద్యా సంవత్సరం ప్రారంభం అవుతుందని స్పష్టం చేశారు. గత 40 నెలల్లో విద్యాశాఖలో తీసుకున్న నిర్ణయాలు, వాటి అమలు, వచ్చే 20 నెలల్లో చేపట్టాల్సిన కార్యక్రమాలపై బుధవారం సచివాలయంలో విద్యాశాఖ ఉన్నతాధికారులతో కడియం సమీక్ష నిర్వహించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి చేపట్టాల్సిన కార్యక్రమాలపై డిసెంబర్ 10వ తేదీలోపు ప్రణాళికలను సిద్ధం చేయాలని ఆదేశించారు. వచ్చే ఏడాది నుంచి వార్షిక కేలండర్‌ను ప్రభుత్వంతోపాటు ప్రైవేట్, కార్పొరేట్, ఇతర అన్ని విద్యా సంస్థలు పాటించాలన్నారు. సెలవుల్లో పాఠశాలలు, కాలేజీలు నడపకూడదన్నారు.
సెలవుల్లో పోటీ పరీక్షలకు ప్రత్యేకంగా అనుమతులు తీసుకోవాలన్నారు. అలాగే హాస్టళ్లకు అనుమతులు తీసుకోవాలన్నారు. తనిఖీలు చేపట్టి నిబంధనల ప్రకారం ఉన్న వాటికే అనుమతులు ఇస్తామన్నారు. ఉమ్మడి ప్రవేశ పరీక్షలను ఇకపై ఆన్‌లైన్‌లో నిర్వహిస్తామన్నారు. ఇందుకు అవసరమైన ఏర్పాట్లను ఉన్నత విద్యా మండలి ఇప్పటికే పూర్తి చేసిందన్నారు. విశ్వవిద్యాలయాల్లో కాంట్రాక్టు ఉద్యోగుల వేతనాలను 70 శాతం మేర పెంపునకు సీఎం కేసీఆర్ ఆమోదించాల్సి ఉందన్నారు. పోస్టుల భర్తీని యూనివర్సిటీలే చేపడతాయని, త్వరలోనే నోటిఫికేషన్లు వస్తాయని తెలిపారు. అన్ని విద్యా సంస్థల్లో కచ్చితంగా ప్రాక్టికల్స్ చేయించే విధంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి కొత్త జిల్లాల ప్రాతిపదికన విద్యా సంస్థల్లో మౌలిక వసతులు కల్పిస్తామన్నారు.
మౌలిక వసతులకోసం రూ.2 వేలకోట్ల పనులు
విద్యాశాఖ సంక్షేమ, మౌలిక వసతుల అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో రూ. 2 వేల కోట్ల పనులు కొనసాగుతున్నాయని, అవన్నీ వచ్చే జూన్‌లోపు పూర్తి చేయాలని గడువు విధించామని తెలిపారు. ప్రతి విద్యా సంస్థలో ఐటీæ సెల్ పెట్టాలని నిర్ణయించినట్లు చెప్పారు. పాఠశాలలు, కాలేజీల్లో క్రీడలకు ప్రాధాన్యం కల్పిస్తామన్నారు. ఇందుకు అనుగుణంగా పీఈటీ పోస్టులను భర్తీ చేస్తామని, ఈలోగా విద్యా వలంటీర్లను నియమిస్తామని చెప్పారు.
విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్న సంఘటనలకు సంబంధించి ఆయా కాలేజీలపై క్రిమినల్ కేసులు పెట్టామన్నారు. ఈ సమావేశంలో ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ తుమ్మల పాపిరెడ్డి, విద్యా, సంక్షేమ, మౌలిక వసతుల అభివృద్ధి సంస్థ చైర్మన్ నాగేందర్, విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రంజీవ్ ఆర్ ఆచార్య, ఇంటర్ బోర్డు కార్యదర్శి అశోక్, పాఠశాల విద్యా డైరెక్టర్ కిషన్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment