తెలంగాణ ప్రభుత్వం స్థలం కేటాయించిన వెంటనే కాజీపేట్ వ్యాగన్ ఫ్యాక్టరీ నిర్మాణ పనులను చేపట్టనున్నట్లు దక్షిణమధ్య రైల్వే జనరల్ మేనేజర్ పి.కె.శ్రీవాస్తవ తెలిపారు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం స్థలం కేటాయించిన వెంటనే కాజీపేట్ వ్యాగన్ ఫ్యాక్టరీ నిర్మాణ పనులను చేపట్టనున్నట్లు దక్షిణమధ్య రైల్వే జనరల్ మేనేజర్ పి.కె.శ్రీవాస్తవ తెలిపారు. రైల్వేశాఖ ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై మంగళవారం రైల్ నిలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రస్తుత బడ్జెట్ వాస్తవికతకు అనుగుణంగా ఉందని సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ బడ్జెట్‌లో కాజీపేట్ వ్యాగన్ ఫ్యాక్టరీ కోసం రూ.5 కోట్లు కేటాయించారని చెప్పారు.
నిధుల కేటాయింపు పెద్దగా సమస్య కాదని, ఫ్యాక్టరీకీ కావలసిన స్థలమే ముఖ్యమని పేర్కొన్నారు. సుమారు రూ.150 కోట్ల వ్యయంతో చేపట్టనున్న ఈ ప్రాజెక్టు కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి 125 ఎకరాల భూమిని కోరుతున్నట్లు చెప్పారు. ఈ అంశంపై ఇటీవల ముఖ్యమంత్రి కేసీఆర్‌తోనూ తాను మాట్లాడానని పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టుకే కాకుండా రాష్ర్టంలో ఎక్కడైనా రైల్వేల అభివృద్ధికి భూములను కేటాయించడంతో పాటు, అవసరమైన నిధులు, సహాయ సహకారాలను అందజేసేందుకు సీఎం సానుకూలంగా స్పందించారని చెప్పారు.