కాలనీ అంతా ఈ చెత్తేంది..? | KCR asks people why dust garbage stored at streets | Sakshi
Sakshi News home page

కాలనీ అంతా ఈ చెత్తేంది..?

Published Mon, Feb 23 2015 1:57 AM | Last Updated on Wed, Aug 15 2018 9:27 PM

కాలనీ అంతా ఈ చెత్తేంది..? - Sakshi

కాలనీ అంతా ఈ చెత్తేంది..?

* హైదరాబాద్‌లోని మమతానగర్‌లో సీఎం ఆకస్మిక పర్యటన
చెత్తాచెదారం ఎందుకుందంటూ కాలనీవాసులకు ప్రశ్న
వారం రోజుల్లో మళ్లీ వస్తా.. అంతా శుభ్రంగా ఉండాలని సూచన

 
 హైదరాబాద్: ఓ వివాహానికి హాజరైన ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు స్వయంగా వాహనం దిగి కాలనీవాసులతో సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ‘బిల్డింగ్‌లు చూస్తే మంచిగా ఉన్నాయి.. ఇక్కడ అంతా చెత్తాచెదారం పేరుకుపోయింది ఎందుకు’ అని   ప్రశ్నించారు. వివరాల్లోకి వెళితే.. కరీంనగర్‌కు చెందిన అట్లూరి రామకృష్ణ ఆర్‌అండ్‌బీలో చీఫ్ ఎగ్జిక్యూటీవ్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నారు. అతని కుమారుడు గౌతమ్ వివాహం హైదరాబాద్ నాగోలులోని శుభం కన్వెన్షన్ హాలులో ఆదివారం జరిగింది. ఈ వివాహానికి హాజరైన సీఎం.. వధూవరులను ఆశీర్వదించి నాగోల్ నుంచి మమతానగర్‌కాలనీ రోడ్డు నం బర్-4 మీదుగా వెళ్తుండగా అక్కడ రోడ్డంతా చెత్తాచెదారంతో నిండి ఉండడం గమనించారు. వెంటనే తన కాన్వాయ్‌ను ఆపించి అక్కడున్న కాలనీవాసుల వద్దకు వెళ్లిన కేసీఆర్.. రోడ్డంతా చెత్తాచెదారంతో ఎందుకు ఉందని వారిని ప్రశ్నించారు. ఈ సందర్భంగా అక్కడే ఉన్న విజయలక్ష్మి... తమ కాల నీలో దొంగతనాలు కూడా బాగా జరుగుతున్నాయని, గతంలో దొంగలు తన గొలుసు లాక్కెళ్లారని, పోలీ సులు కూడా స్పందించడం లేదని విలపిస్తూ   ఫిర్యాదు చేసింది.వెంటనే స్పందించిన  ఆయన ఈ ప్రాంతం ఏ పోలీస్‌స్టేషన్ పరిధిలోకి వస్తుందని పక్కనే ఉన్న ఎస్‌ఐని అడిగి తెలుసుకున్నారు.
 
 సైబరాబాద్ సీపీ ఆనంద్‌కు సమాచారం అందించి కాలనీవాసులతో సమావేశం ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అనంతరం సీఎం కాలనీవాసులతో మాట్లాడుతూ..‘వారం రోజుల్లో మళ్లీ మీ కాలనీకి వస్తా.. అంతటా పర్యటిస్తా.. కాలనీ శుభ్రంగా ఉండాలి’ అని  సూచించి వెళ్లారు. ఈ సందర్భంగా సీఎం పీఏ.. కాలనీ అధ్యక్షుడు శ్రీనివాస్‌రెడ్డికి ఫోన్ చేసి కాలనీ అంతా అపరిశుభ్రంగా ఉండడంపై ఎందుకు స్పందించడం లేదన్నారు. ఈ విషయంపై తాము పలుమార్లు ఫిర్యాదు చేసినా   అధికారులు పట్టించుకోవడం లేదని, గుర్రపుడెక్కతో నాగోలు చెరువు పూర్తిగా నిండిపోయిం దని శ్రీనివాస్‌రెడ్డి వారికి బదులిచ్చారు. కాగా, సీఎం నుంచి ఆదేశాలు రావడంతో పోలీసు యంత్రాంగం సాయంత్రంలోపే కాలనీకి చేరుకుంది. సీపీ సీవీ ఆనంద్ హుటాహుటిన మమతానగర్ కాలనీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ‘స్మార్ట్ సిటీ సెక్యూరిటీ- స్మార్ట్ కాలనీస్’ పేరిట సదస్సు నిర్వహించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement