స్వతంత్రంగా లా కోర్సును ప్రారంభించండి | kcr at nalsar university | Sakshi
Sakshi News home page

స్వతంత్రంగా లా కోర్సును ప్రారంభించండి

Published Sun, Jul 30 2017 2:13 AM | Last Updated on Tue, Oct 16 2018 8:54 PM

స్వతంత్రంగా లా కోర్సును ప్రారంభించండి - Sakshi

స్వతంత్రంగా లా కోర్సును ప్రారంభించండి

నల్సార్‌ యూనివర్సిటీని కోరిన సీఎం కేసీఆర్‌
మూడేళ్ల ఈ కోర్సుకు ప్రభుత్వమే పూర్తి ఆర్థిక సాయం అందిస్తుంది
వర్సిటీ 15వ స్నాతకోత్సవంలో ప్రసంగించిన ముఖ్యమంత్రి

సాక్షి, హైదరాబాద్‌:
జాతీయ ఉమ్మడి ప్రవేశపరీక్ష (సీఎల్‌ఏటీ)తో సంబంధం లేకుండా స్వతంత్రంగా మూడేళ్ల లా కోర్సును ప్రారంభించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు నల్సార్‌ న్యాయ విశ్వవిద్యాలయాన్ని కోరారు. తద్వారా దేశంలోనే ఈ కోర్సును ప్రారంభించిన మొదటి వర్సిటీ నల్సారే అవుతుందన్నారు.  ఈ మూడేళ్ల ఎల్‌ఎల్‌బీ కోర్సులో 50% సీట్లను తెలంగాణ వాసులకే కేటాయించాలన్నారు. ఈ కోర్సుకు ప్రభుత్వమే పూర్తి ఆర్థికసాయాన్ని అందిస్తుందన్నారు. శనివారం హైదరాబాద్‌కు సమీపంలోని శామీర్‌పేటవద్ద ఉన్న నల్సార్‌ న్యాయ విశ్వవిద్యాలయం 15వ స్నాతకోత్సవానికి ముఖ్యఅతిథిగా హాజరైన సీఎం కేసీఆర్‌ ఈ సందర్భంగా విద్యార్థులనుద్దేశించి ప్రసంగించారు.1998లో నల్సార్‌ ఏర్పాటైన నాటినుంచి స్నాతకోవత్సంలో ప్రసంగించిన తొలి సీఎంగా ఘనతను కేసీఆర్‌ దక్కించుకున్నారు.

న్యాయవాదులకూ నైపుణ్యం..
న్యాయాధికారులు, న్యాయమూర్తులు నైపుణ్యాలను పెంచుకునేందుకు జ్యుడీషియల్‌ అకాడమీ ఉందని, నాయ్యవాదులకు మాత్రం దేశంలో ఎక్కడా కూడా అటువంటి సదుపాయం లేదన్నారు. న్యాయవాదుల కోసం ‘బార్‌–ఎట్‌–లా’కోర్సును ప్రారంభించాలని నల్సార్‌ను కోరారు. తద్వారా న్యాయవాదులకు తమ నైపుణ్యాలను మెరుగుపరుచుకునే అవకాశం ఉంటుందన్నారు. అకడమిక్‌ స్టాఫ్‌ కాలేజీ, హాస్టళ్లు, పరిశోధనా కేంద్రాల నిర్మాణం కోసం నల్సార్‌ వర్సిటీ ఎదురుగా ఉన్న 22 ఎకరాల భూమిని  కేటాయిస్తామని, ఈ విషయంలో హైకోర్టుతో సంప్రదింపులు జరుపుతామన్నారు. వర్సిటీ కోసం నిధులను కేటాయించేందుకు కట్టుబడి ఉన్నామన్నారు. ఉన్నత విద్యలో జాతీయస్థాయి అత్యుత్తమ కేంద్రాలను ఏర్పాటు చేసేం దుకు తమ ప్రభుత్వం కృషి చేస్తుందని కేసీఆర్‌ తెలిపారు. తమది కొత్త రాష్ట్రమని, ఈ రాష్ట్రంలోని విద్యా సంస్థలపై  కీలక బాధ్యతలు ఉన్నాయని అన్నారు.

ల్యాండ్‌ క్లినిక్‌ల పనితీరు అద్భుతం...
వరంగల్‌ జిల్లాలో నల్సార్‌ ఆధ్వర్యంలో జరిగిన ల్యాండ్‌ క్లినిక్‌లు భూ వివాదాలకు పరిష్కారం చూపడంలో అత్యద్భుత పనితీరును చూపాయని కేసీఆర్‌ అన్నారు. వెనుకబడిన తరగతుల కోసం ప్రభుత్వం అనేక పథకాలను ప్రారంభించిందని, ఆ వర్గాలు ఈ పథకాల ద్వారా లబ్ధి పొందడం  పూర్తిస్థాయిలో జరగడం లేదన్నారు. నల్సార్‌ వర్సిటీ తమ ల్యాండ్‌ క్లినిక్‌ల ద్వారా ప్రభుత్వ పథకాల నుంచి లబ్ధి పొందేందుకు, వివాదాల పరిష్కారానికి ప్రజలకు సాయం చేయాలని కోరారు. తన బంగారు తెలంగాణ స్వప్నం సాకారం కావడంలో నల్సార్‌ కీలక భూమిక పోషించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి, నల్సార్‌ చాన్సలర్‌ జస్టిస్‌ రమేశ్‌ రంగనాథన్, సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తులు జస్టిస్‌ ఎస్‌.ఎం.ఖాద్రీ, జస్టిస్‌ పి.వెంకటరామారెడ్డి, మల్కాజ్‌గిరి పార్లమెంట్‌ సభ్యుడు మల్లారెడ్డి, ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి, నల్సార్‌ వైస్‌ చాన్స్‌లర్‌ ఫైజన్‌ ముస్తఫా, రిజిస్ట్రార్‌ వి.బాలకృష్ణారెడ్డి, పలువురు న్యాయమూర్తులు, బార్‌ కౌన్సిల్‌ సభ్యులు, ఎమ్మెల్సీ రాంచందర్‌రావు, మేడ్చల్‌ జిల్లా గ్రంథాలయాల చైర్మన్‌ భాస్కర్‌యాదవ్, ఎంపీపీల ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు చంద్రశేఖర్‌యాదవ్‌ తదితరులు పాల్గొన్నారు. అనంతరం వివిధ కోర్సుల్లో ప్రతిభ కనబరచిన విద్యార్థులకు సీఎం కేసీఆర్‌ స్వర్ణ పతకాలను అందచేశారు. అత్యుత్తమ ప్రతిభ చూపిన రాహుల్‌ మహంతి అనే విద్యార్థి ఏకంగా 11 బంగారు పతకాలు సాధించారు.

సామాన్యులకూ విజ్ఞానం అందించండి..
న్యాయవాద వృత్తిని స్వీకరించే వృత్తి నిపుణులకే విద్యా కార్యక్రమాలను పరిమితం చేయవద్దని సీఎం కేసీఆర్‌ వర్సిటీని కోరారు. సామాన్యులకు సైతం న్యాయ విజ్ఞానాన్ని అందించాలని, తద్వారా వారికీ, సమాజానికీ మంచి జరుగుతుందన్నారు. హైదరాబాద్‌ సిటీ క్యాంపస్‌లో సివిల్‌ జడ్జి పోస్టులకు, ఉన్నత న్యాయ సర్వీసుల పరీక్షలకు సిద్ధమయ్యే ఔత్సాహికులకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. సిటీ క్యాంపస్‌ పాతబడిపోయిందని, దానికి మరమ్మతులు చేసి పునరుద్ధరించాల్సి ఉందన్నారు. సిటీ క్యాంపస్‌ విషయంలోనూ అవసరమైన సహా యం అందించేందుకు ప్రభుత్వం ఎప్పు డూ సిద్ధంగా ఉందన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement