అంబేడ్కర్ జయంతి ఉత్సవాల్లో కడియం శ్రీహరి ఎవరెస్ట్ ఎక్కిన పూర్ణ, ఆనంద్‌లకు సన్మానం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు, మహిళల అభ్యున్నతికి ప్రభుత్వం కచ్చితమైన చర్యలు తీసుకుంటుం దని, అందుకోసం ప్రత్యేక ప్రణాళికలను రూపొందించి అమలు చేయాలనే స్పష్టమైన అవగాహనతో ఉందని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి వెల్లడించారు. మంగళవారం హైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్ వద్ద నిర్వహించిన బీఆర్ అంబేడ్కర్ రాష్ర్టస్థాయి జయంతి ఉత్సవాల్లో ఆర్థిక మంత్రి, ఈ ఉత్సవాల కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్, వివిధ సంఘాల నాయకులతో కలసి కడియం శ్రీహరి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలను మరింత మెరుగ్గా అమలు చేసేందుకు వాటిని సమీక్షించాల్సిందిగా తనతోపాటు సహచర మంత్రులు ఈటల, అజ్మీరా చందూలాల్, జోగు రామన్నలను సీఎం కేసీఆర్ ఆదేశించారని కడియం చెప్పారు. ఈ విషయమై తాము (నలుగురు మంత్రులు) దళిత సంఘాల అభిప్రాయాలను తెలుసుకుంటామన్నారు. జిల్లాల్లో విద్యార్థినులకు డిగ్రీ కాలేజీల కొరతను అధిగమించేలా సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయ సంస్థల సొసైటీ ద్వారా డిగ్రీ కాలేజీలు ప్రారంభించేందుకు సీఎం అంగీకరించారని తెలిపారు. 2015-16 లో లక్ష పైచిలుకు ఉద్యోగాలను భర్తీ చేసేందు కు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు.
హామీలన్నీ అమలు చేస్తాం: ఈటల
తమ ప్రభుత్వం బోధించు, సమీకరించు, ఉద్యమించు అన్న అంబేడ్కర్ ఆశయాలను గుర్తుం చుకుని ముందుకు సాగుతోందని మంత్రి ఈటల తెలిపారు. తెలంగాణలో అంబేడ్కర్ ఒక కులానికో, మతానికో పరిమితమైన వ్యక్తి కాదని, జాతిరత్నం, ప్రపంచ మేధావుల్లో ఒక మహనీయుడిగా గుర్తిస్తూ ఆయన జయంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తోందన్నా రు. రాష్ర్టంలో 85 శాతమున్న బడుగులు అభివృద్ధి సాధించకుండా బంగారు తెలంగాణ సాధ్యం కాదని సీఎం కేసీఆర్ భావించారన్నా రు. సబ్‌ప్లాన్ ప్రకారం నిధులను కచ్చితంగా ఖర్చు చేస్తామన్నారు.
ఎస్సీ హాస్టళ్లు, స్కూళ్లలో పిల్లల స్థితిగతులను మెరుగుపరిచేందుకు ఆయా చార్జీలను పెంచేందుకు ఆలోచిస్తున్నట్లు చెప్పారు. ఈ సందర్భంగా ఎవరె స్ట్ శిఖరాన్ని అధిరోహించిన పూర్ణ, ఆనంద్‌లను ఘనంగా సన్మానించారు. అంతకుముందు బషీర్‌బాగ్‌లోని బాబూ జగ్జీవన్‌రాం విగ్రహం నుంచి ట్యాంక్‌బండ్ వద్దనున్న అంబేడ్కర్ విగ్రహం వరకు దళిత సంఘాల ఆధ్వర్యంలో ఊరేగింపును నిర్వహించారు. ఊరేగింపులో పూర్ణ, ఆనంద్‌లను భుజాలపైకి ఎత్తుకుని వేదికపైకి తీసుకొచ్చారు. ఆనంద్ మాట్లాడుతూ ఎవరెస్ట్ ఎక్కడం తన తొలిమెట్టు అని, ఇంకా 99 మెట్లు ఎక్కి ఐపీఎస్ అధికారి కావాలనేది తన ఆశయమన్నాడు. పూర్ణ మాట్లాడుతూ ఆడపిల్లలపట్ల వివక్ష చూపకుండా తల్లితండ్రులు బాగా చదివించాలని కోరింది.
మంత్రుల ఎదుటే దళిత సంఘాల నిరసన
ప్రభుత్వ ప్రచార ఆర్భాటమే తప్ప సంక్షేమ పథకాలు సరిగ్గా అమలుకావడం లేదని ఆరోపిస్తూ సభ ప్రారంభానికి ముందు దళిత సంఘాల నేతలు మంత్రుల ఎదుటే నిరసన గళం వినిపించారు. భూపంపిణీ, ఇతర స్వయం ఉపాధి పథకాల ద్వారా దళితులకు లబ్ధి జరగట్లేదని పేర్కొన్నారు. కాగా, రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పిడమర్తి రవి మాట్లాడుతూ దళిత వర్గ ఎమ్మార్వోలు ఉన్న చోటే మూడెకరాలు భూపంపిణీ జరుగుతోందని, ఇతర ఎమ్మార్వోలు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఈ సభకు అంబేడ్కర్ ఉత్సవాల నిర్వహణ రాష్ర్టస్థాయి చైర్‌పర్సన్‌పెబ్బె జీవ మాదిగ అధ్యక్షత వహించగా రాష్ట్ర సాంస్కృతిక మండలి చైర్మన్ రసమయి బాలకిషన్, వివిధ సంఘాల నేతలు పాల్గొన్నారు.
అంబేడ్కర్ స్ఫూర్తితో ముందుకు..
అట్టడుగు వర్గాల అభ్యున్నతి కోసం కృషి చేసిన అంబేడ్కర్ స్ఫూర్తితో బడుగుల సంక్షేమ పథకాలను అమలు చేస్తామని రవాణా మంత్రి పి. మహేందర్‌రెడ్డి తెలిపారు. అంబేడ్కర్ జయంతిని పురస్కరించుకుని ఆర్టీసీ ఉద్యోగులు కళాభవన్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సహచర మంత్రి నాయినితో కలసి రాజ్యాంగ నిర్మాతకు పుష్పాంజలి ఘటించారు.
ఆశయాల సాధనే అసలు నివాళి
గాంధీభవన్‌లో అంబేడ్కర్ జయంతి వేడుకలు
సాక్షి, హైదరాబాద్: డాక్టర్ అంబేడ్కర్ ఆశయాల సాధనతోనే ఆయనకు అసలైన నివాళి అర్పించినట్టుగా ఉంటుందని టీపీసీసీ నేతలు అన్నారు. డాక్టర్ బీఆర్.అంబేడ్కర్ 125వ జయంతి వేడుకలను గాంధీభవన్‌లో మంగళవారం నిర్వహించారు. టీపీసీసీ అధ్యక్షులు ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఏఐసీసీ కార్యదర్శి రామచంద్ర కుంతియా, టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షులు మల్లు భట్టివిక్రమార్క, సీఎల్‌పీ నేత కె.జానారెడ్డి, శాసనమండలిలో ప్రతిపక్షనేత షబ్బీర్ అలీ, పీసీసీ మాజీ అధ్యక్షులు డి.శ్రీనివాస్, పొన్నాల లక్ష్మయ్య, ఎంపీ నంది ఎల్లయ్య, ఏఐసీసీ అధికార ప్రతినిధి మధుయాష్కీ, కేంద్ర మాజీ మంత్రి బలరాం నాయక్, మాజీ ఎంపీలు పొన్నం ప్రభాకర్, మల్లు రవి, మాజీ మంత్రి వినోద్ తదితరులు అంబేడ్కర్‌కు పూలమాలవేసి నివాళులర్పించారు.
టీపీసీసీ ఎస్సీ సెల్ అధ్యక్షులు కృష్ణ అధ్యక్షతన గాంధీభవన్‌లో ఈ సమావేశం జరిగింది. పార్టీ ముఖ్యులు మాట్లాడుతూ అంబేడ్కర్ జయంతి ఉత్సవాలను ఏడాది పొడవునా నిర్వహించాలని ఏఐసీసీ ఆదేశాలు ఇచ్చిందన్నారు. ఈ కార్యక్రమాల నిర్వహణకు 34 మందితో కమిటీ ఏర్పాటైందని ఉత్తమ్ వెల్లడించారు. అంబేడ్కర్ ఆశించిన సామాజిక న్యాయం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమన్నారు. మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూ భారత రాజ్యాంగానికి ప్రపంచదేశాల్లో గుర్తింపు, గౌరవం వచ్చేలా తీర్చిదిద్దిన మేధావి అంబేడ్కర్ అని అన్నారు. షబ్బీర్ అలీ మాట్లాడుతూ దళిత, బహుజన, మైనారిటీ వర్గాలకోసం అంబేడ్కర్ శ్రమిం చారని కీర్తించారు. అంబేడ్కర్ ఆశయాలను ప్రచారం చేస్తున్న పలువురు సామాజికవేత్తలను టీపీసీసీ సన్మానించింది.
సముచితస్థానం దక్కనివ్వలేదు
అంబేడ్కర్ జయంతి సభలో వెంకయ్యనాయుడు
సాక్షి, హైదరాబాద్: గత పాలకులు భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్, నేతాజీ, పటేల్‌కు దేశంలో సముచిత గౌరవాన్ని, స్థానాన్ని ఇవ్వకుండా తొక్కిపెట్టారని కేంద్రమంత్రి ఎం.వెంకయ్యనాయుడు ఆరోపించారు. బీఆర్ అంబేడ్కర్ 125వ జయంతి వేడుకలను పురస్కరించుకుని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మంగళవారం జరిగిన సమావేశంలో వెంకయ్య మాట్లాడుతూ.. గతంలో అధికారంలో ఉన్నవాళ్లకు అంబేద్కర్‌కు భారతరత్న ఇవ్వడానికి, పార్లమెంటులో విగ్రహాన్ని పెట్టడానికి ఎంత సమయం పట్టిందని ప్రశ్నించారు.
నేతాజీ కుటుంబసభ్యులపై నెహ్రూ ప్రభుత్వం నిఘా పెట్టిందనే విషయంలో వాస్తవాలు బయటకు రావాలని కేంద్రం కోరుకుంటోందని, దీనిపై కొందరు ఉలిక్కిపడి అడ్డగోలుగా మాట్లాడుతున్నారని అన్నారు. అంబేడ్కర్ వంటివారు దేశ ప్రయోజనాలకోసం మంత్రి పదవులను వదిలేశారని గుర్తుచేశారు. మరో కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ మాట్లాడుతూ ఇతర దేశాలకు చెందిన మతాల వారు అంబేడ్కర్‌పై ఒత్తిడి తెచ్చినా భారతదేశానికే చెందిన బౌద్ధమతాన్నే అనుసరించారన్నారు. కొన్ని మూఢ విశ్వాసాలకు వ్యతిరేకంగా ఆయన బౌద్ధమతాన్ని స్వీకరించారని, అయినా హిందూ ధర్మాలనే ఆచరించారని చెప్పారు.
కుల వ్యవస్థను కూకటివేళ్లతో పీకేయాలని అంబేడ్కర్ పరితపించారన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి మాట్లాడుతూ అంబేడ్కర్ స్ఫూర్తిని గత ప్రభుత్వాలు విస్మరించాయని విమర్శించారు. అంబేద్కర్ కృషితో ఎస్సీ, ఎస్టీలకు చట్టసభల్లో, స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు కల్పించినా దళితులు రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా ఎదగలేదన్నారు.
బడుగుల అభ్యున్నతికి ప్రత్యేక ప్రణాళికలు
Published Wed, Apr 15 2015 2:19 AM | Last Updated on Tue, Jun 4 2019 6:28 PM
Advertisement
Advertisement