
రాజయ్యపై వేటు.. మంత్రివర్గంలోకి కడియం
తెలంగాణ ఉప ముఖ్యమంత్రి డాక్టర్ తాటికొండ రాజయ్యను మంత్రివర్గం నుంచి తప్పించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సిఫార్సుతో గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ రాజయ్యను మంత్రివర్గం నుంచి తొలగించినట్లు ప్రకటించారు. గవర్నర్ ఈ మేరకు అధికారిక ప్రకటన కూడా వెలువరించారు. ఉదయం నుంచి క్రమంగా దీనికి సంబంధించిన పరిణామాలు వడివడిగా జరిగిపోయాయి. వైద్య ఆరోగ్యశాఖలో అవినీతి విషయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ సీరియస్గా తీసుకున్నట్లు సమాచారం. అందుకే ఆ శాఖను నిర్వర్తిస్తున్న డాక్టర్ రాజయ్యను తప్పించారు. ఆయ స్థానంలో ఎంపీ కడియం శ్రీహరిని మంత్రివర్గంలోకి తీసుకోవాలని కేసీఆర్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.
కడియం శ్రీహరికి విద్యుత్ శాఖను కేటాయించి, మరో మంత్రి లక్ష్మారెడ్డికి వైద్య ఆరోగ్య శాఖను ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే రాజయ్య పేషీలోని అధికారులందరినీ తప్పించిన కేసీఆర్.. ఇప్పుడు ఏకంగా డిప్యూటీ సీఎంను కూడా తొలగించడం తీవ్ర నిర్ణయమేనంటున్నారు. అవినీతికి పాల్పడితే తన సొంత కుటుంబ సభ్యులనైనా వదిలేది లేదని కేసీఆర్ గతంలో ప్రకటించారు.