ఈనెల 16న జరిగే తెలంగాణ మంత్రివర్గ సమావేశంలో చర్చించే అంశాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ పలువురు మంత్రులు,ప్రభుత్వ ఉన్నతాధికారులతో శనివారం రాత్రి సమావేశం నిర్వహించారు.
అధికారులతో కేసీఆర్ సుదీర్ఘ భేటీ
సాక్షి, హైదరాబాద్ : ఈనెల 16న జరిగే తెలంగాణ మంత్రివర్గ సమావేశంలో చర్చించే అంశాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ పలువురు మంత్రులు,ప్రభుత్వ ఉన్నతాధికారులతో శనివారం రాత్రి సమావేశం నిర్వహించారు. ఫీజు రీయింబర్స్‌మెంటు, రైతు రణమాఫీ, వృద్ధాప్య,వికలాంగుల పెన్షన్, దళితులకు మూడెకరాల భూమి పంపిణీ, పోలవరం ముంపు ప్రాంతాలను సీమాంధ్రలో కలిపే బిల్లుకు లోకసభ ఆమోదించడం తదితర అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. హైదరాబాద్‌ను మురికివాడలులేని నగరంగా తీర్చిదిద్దే చర్యలపై కూడా చర్చించారు. ఆయా శాఖల నుంచి వచ్చే ప్రతిపాదనలనన్నింటినీ సోమవారం సాయంత్రంలోపే జీఏడీకి పంపేలా చూడాలని, ఆయా శాఖలపై మంగళవారం తుది నిర్ణయం తీసుకుని ఎజెండా ఖరారు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. పోలవరంతో పాటు, కృష్ణా జలాల పంపిణీ అంశంపై కూడా నీటిపారుదల శాఖ అధికారులతో చర్చించారు. ముంపు గ్రామాలను ఆంధ్రలో కలపడాన్ని నిరసిస్తూ అవసరమైతే మంత్రివర్గం తీర్మానం చేయడంతోపాటు సుప్రీంకోర్టుకు వెళ్లే అంశంపై కేబినెట్‌లో నిర్ణయం తీసుకోనున్నారు.
మురికివాడలులేని నగరంగా హైదరాబాద్
హైదరాబాద్‌లో మురికివాడలు లేకుండా చేసేందుకు ప్రణాళికలు రూపొందించాలని ముఖ్యమంత్రి పురపాలకశాఖ ముఖ్య కార్యదర్శి జోషి, జీహెచ్‌ఎంసీ కమిషనర్ సోమేశ్‌కుమార్‌ను ఆదేశించారు. మురికివాడల్లో నివసించే ప్రజలను ఎక్కడో నగరం బయటికి పంపకుండా వారు నివసిస్తున్న ప్రదేశంలోనే మౌలికసదుపాయాలతో పాటు జీవనప్రమాణాలు పెంచేలా ఇళ్లు నిర్మించాలని సూచించారు. దశలవారీగా దీనిని అమలు చేయాలన్నారు. ఈ సమావేశంలో ఆర్థికమంత్రి ఈటెల రాజేందర్, ఆర్థిక, మునిసిపల్, పంచాయతీరాజ్, నీటిపారుదల శాఖల ముఖ్యకార్యదర్శులు పాల్గొన్నారు.