
మంత్రులు పోచారం శ్రీనివాస్ రెడ్డి, కేటీఆర్ (ఫైల్ ఫోటో)
సాక్షి, రాజన్న సిరిసిల్ల: ముఖ్యమంత్రి స్వయానా రైతు కాబట్టి రైతుల సమస్యలు ప్రత్యక్షంగా తెలుసుననీ, అందువల్లనే వారి కష్టాలు దూరం చేసేందుకు వ్యవసాయానికి కోతల్లేకుండా కరెంట్ ఇస్తున్నారని మంత్రులు కేటీఆర్, పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. సర్దాపూర్‌లో జరిగిన రైతుబీమా అవగాహనా సదస్సులో వారు పాల్గొని మాట్లాడారు. లక్షలాది రైతు కుంటుంబాలకు రైతు బీమా పెద్ద భరోసా అని కేటీఆర్ అన్నారు.
‘సిరిసిల్ల అంటే నేతన్నల, రైతుల ఆత్మహత్యలతో కన్నీళ్లు తప్పితే, నీళ్లు తెలియని ప్రాంతంగా ఉండేది. మా ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోంది. మరో ఆరు నెలల్లో కాళేశ్వరం నీటితో జిల్లాలోని రెండు లక్షల ఎకరాలకు నీరందిస్తామ’ని ఆయన స్పష్టం చేశారు. వ్యవసాయం లాభసాటిగా మారేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని కేటీఆర్ తెలిపారు. ప్రతి అయిదు వేల ఎకరాలకు ఒక విస్తరణాధికారి చొప్పున రాష్ట్ర వ్యాప్తంగా 2600 మందిని నియమించామనీ, రైతు బంధు పథకంతో 5700 కోట్ల రూపాయల లబ్ది రైతులకు చేకూర్చామని ఆయన వెల్లడించారు.
రైతుబంధులో పక్షపాతం లేదు..
రాష్ట్రంలోని ప్రతి నియోజక వర్గానికి లక్ష ఎకరాల చొప్పున త్వరలో రెండు పంటలకు సాగునీరు అందిస్తామని మంత్రి పోచారం తెలిపారు. కోటి ఎకరాలకు నీరందించడం ద్వారా తెలంగాణ ప్రభుత్వం చరిత్ర సృష్టించబోతోందని అన్నారు. పార్టీలకు అతీతంగా రాష్ట్రంలోని రైతులందరికీ రైతుబందు చెక్కులు అందించామని తెలిపారు. కుల, మత, పార్టీలలకు అతీతంగా నిరుపేదలందరికీ డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఇవ్వాలని ముఖ్యమంత్రి ఆదేశించారని మంత్రి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment