కేసీఆర్ తండ్రిలాంటివారు: రాజయ్య
హైదరాబాద్: ‘సీఎం కేసీఆర్ మాకు తండ్రిలాంటివాడు. మంత్రులకు, ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు, ఎంపీలకు దిశను నిర్దేశించే బాధ్యత ఆయనదే. మేవుు తప్పుచేస్తే తండ్రి గా, నాయకుడిగా సరిదిద్దే బాధ్యత కేసీఆర్‌పై ఉంది’ అని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి డాక్టర్ కె.రాజయ్య అన్నారు. తెలంగాణ భవన్‌లో గురువారం ఆయున విలేకరులతో మాట్లాడుతూ గత ప్రభుత్వాల్లాగా ఆదరాబాదరాగా ప్రమాణాలు చేసి అమలు చేయకుంటే బాగుండదని వరంగల్ సభలో సీఎం కేసీఆర్ చెప్పడం తప్పేమీ కాదన్నారు. దీనిని అడ్డు పెట్టుకుని కొందరు బ్లాక్‌మెయిల్ రాజకీయాలకు దిగడాన్ని ఖండిస్తున్నట్టు ఆయున చెప్పారు. ‘నా భుజం మీద తుపాకి పెట్టి కేసీఆర్‌ను కాల్చాలని రాజకీయ కోణంలో మంద కృష్ణ లాంటివారు ప్రయత్నిస్తున్నారు.
మంద కృష్ణను పావుగా వాడుకుంటూ తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బకొట్టాలనుకుంటున్నారు. డిప్యూటీ సీఎం పదవి కేసీఆర్ ఇచ్చిన వరం. కేసీఆర్ ప్రభుత్వంలో ఎమ్మెల్యేగా కాదు, కార్యకర్తగా ఉండటమే గొప్పవిషయం. కేసీఆర్ ఇచ్చిన డిప్యూటీ సీఎం పదవికి వన్నె తీసుకురావాల్సిన బాధ్యత నాపై ఉంది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో కార్పొరేట్‌స్థాయి వైద్యం అందించాల్సిన బాధ్యత ఉంది. ఇది మా కుటుంబ విషయం. తెలంగాణవాదుల్లో, దళితుల్లో గందరగోళం సృష్టించొద్దు’ అని రాజయ్య అన్నారు.