‘రక్షణ’ భూముల అప్పగింతకు కేంద్రం ఓకే
కొత్త సచివాలయం కోసం బైసన్ పోలో మైదానం
రహదారుల విస్తరణకు రక్షణ శాఖ ఇతర స్థలాలు
అభివృద్ధి పనులపై జీఎస్టీ తగ్గింపునకూ సానుకూలత..
9న జరిగే భేటీలో దీనిపై తగిన నిర్ణయం
కేంద్ర మంత్రి జైట్లీతో సీఎం కేసీఆర్ భేటీ
అనంతరం రాష్ట్ర ప్రభుత్వ ప్రకటన
సాక్షి, న్యూఢిల్లీ
హైదరాబాద్‌లో నూతన సచివాలయ నిర్మాణం, రాజీవ్, మేడ్చల్ రహదారుల విస్తరణకు వీలుగా రక్షణ శాఖ పరిధిలోని స్థలాలను ఇచ్చేందుకు కేంద్రం అంగీకరించింది. కేంద్ర ఆర్థిక, రక్షణ శాఖ మంత్రి అరుణ్ జైట్లీతో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు శనివారం ఇక్కడ సమావేశమయ్యారు. అనంతరం సమావేశ వివరాలపై రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ భేటీలో రక్షణ శాఖ భూముల అప్పగింత, ప్రజోపయోగ నిర్మాణాలపై జీఎస్టీ తగ్గింపు అంశాలపై ముఖ్యమంత్రి చర్చించారు. ఈ రెండు అంశాలపై జైట్లీ సానుకూలత వ్యక్తం చేసినట్టు ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్ర ప్రభుత్వం నిర్మించతలపెట్టిన నూతన సచివాలయం కోసం బైసన్ పోలో మైదానంలో 40 ఎకరాలు, కరీంనగర్ (రాజీవ్), మేడ్చల్ రహదారుల విస్తరణకు బైసన్ పోలో మైదానంలోని మరికొంత స్థలం, రక్షణ శాఖ పరిధిలోని ఇతర స్థలాలను అప్పగించేందుకు ఇదివరకే కేంద్రం సూత్రప్రాయంగా అంగీకరించగా.. తాజా భేటీలో స్థలాల అప్పగింత విషయమై నిర్ణయం తీసుకున్నట్టు జైట్లీ ముఖ్యమంత్రికి వివరించారు.
రాష్ట్ర ప్రభుత్వం గతంలో చేసిన విజ్ఞప్తిని అన్ని కోణాల్లో పరిశీలించి స్థలాలను అప్పగించాలని నిర్ణయించినట్టు జైట్లీ, ముఖ్యమంత్రికి తెలిపారు. మిషన్ భగీరథ, నీటి పారుదల, గృహ నిర్మాణం, రహదారులు.. తదితర ప్రజోపయోగ నిర్మాణాలపై జీఎస్టీని తగ్గించాలనే అంశంపై కూడా ఈనెల 9న హైదరాబాద్‌లో జరిగే సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని జైట్లీ ముఖ్యమంత్రికి వెల్లడించారు. గతంలో తెలంగాణ ప్రభుత్వం చేసిన విజ్ఞప్తి మేరకే నిర్మాణ పనులపై జీఎస్టీని 18 నుంచి 12 శాతానికి తగ్గించామని జైట్లీ తెలిపారు. ప్రస్తుతం ఈ 12 శాతం నుంచి 5 శాతానికి తగ్గించే విషయంలో కూడా తగిన నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. కాగా, రక్షణ శాఖ భూముల అప్పగింత, జీఎస్టీపై రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తిపై సానుకూలంగా స్పందించినందుకు అరుణ్ జైట్లీకి ముఖ్యమంత్రి కృతజ్ఞతలు తెలిపారు. కొత్త సచివాలయ నిర్మాణం, రహదారుల విస్తరణ ఆవశ్యకతను కేంద్రం గుర్తించిందని ప్రభుత్వం ఈ ప్రకటనలో తెలిపింది. ముఖ్యమంత్రితో పాటు ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన సలహాదారు రాజీవ్‌శర్మ, సీఎం ముఖ్య కార్యదర్శి ఎస్.నర్సింగ్‌రావు పాల్గొన్నారు.