ఆతిథ్యం అదిరిపోవాలి
- జీఎస్టీ మండలి సమావేశానికి విస్తృత ఏర్పాట్లు
- 9న హెచ్‌ఐసీసీలో భేటీ.. తాజ్ ఫలక్‌నుమాలో డిన్నర్
- ఇంకా ఖరారుకాని అరుణ్‌జైట్లీ పర్యటన..!
సాక్షి, హైదరాబాద్: వస్తు, సేవల పన్ను(జీఎస్టీ) అమలులో కీలకపాత్ర పోషించే జీఎస్టీ మండలి సమావేశం నిర్వహణ కోసం రాష్ట్ర రాజధానిలో విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. జీఎస్టీ అమల్లోకి వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో తొలిసారి నిర్వహిస్తున్న ఈ భేటీకి ఘన ఆతిథ్యం ఇచ్చేలా వాణిజ్య పన్నుల శాఖ అధికారులు ప్రణాళిక రూపొందించారు. ఈ నెల 9న ఉదయం 11 గంటల నుంచి హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్(హెచ్‌ఐసీసీ)లో జీఎస్టీ మండలి సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి కౌన్సిల్ చైర్మన్ హోదాలో కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీతో పాటు దేశంలోని 29 రాష్ట్రాలకు చెందిన ఆర్థిక మంత్రులు, వాణిజ్య పన్నుల శాఖ ఉన్నతాధికారులు, కేంద్ర ఆర్థిక శాఖ ఉన్నతాధికారులు హాజరుకానున్న నేపథ్యంలో ప్రభుత్వం దీనిని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.
ముచ్చటగా.. మూడు రోజులు
అన్ని రాష్ట్రాల నుంచి దాదాపు 160 మంది ప్రతినిధులు రానున్న నేపథ్యంలో వారికి ఎలాంటి లోటు రాకుండా వాణిజ్య పన్నుల శాఖ జాగ్రత్తలు తీసుకుంటోంది. విమానాశ్రయం నుంచి ఆతిథ్య ప్రదేశం, సమావేశ మందిరం, నగరంలో పర్యటనలు.. ఇలా అన్ని చోట్లా ఆహ్వానితులకు అం దుబాటులో ఉండేలా సీనియర్ అధికారులను నియమించింది. 9న సమావేశం జరగనుండగా, 8వ తేదీ ఉదయం నుంచే అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసింది. నగరంలోని చారిత్రక ప్రదేశాలన్నింటినీ సందర్శించేలా ప్రణాళిక రూపొందించారు. 8సాయంత్రం వరకు వచ్చిన ఆహ్వానితులకు గోల్కొండ కోటలో లైట్ అండ్ సౌండ్ షో చూపించనున్నారు.
జీఎస్టీ మండలి సమావేశం ముగిసిన అనంతరం రాష్ట్ర ప్రభుత్వం తరఫున తాజ్ ఫలక్‌నుమాలో విందు ఏర్పాటు చేశారు. ఈ విందుకుగానీ, సమావేశానికిగానీ సీఎం కేసీఆర్ హాజరవుతారని సమాచారం. ఇక సమావేశం మరుసటి రోజు ఆహ్వానితులు చార్మినార్, చౌహమల్లా ప్యాలెస్, సాలార్జంగ్ మ్యూజియం, నిజాం జూబ్లీ పెవిలియన్‌ను సందర్శించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. అతిథులందరికీ నోవాటెల్, వెస్టిన్ హైదరాబాద్ హోటళ్లలో బస ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి అధ్యక్షత వహించాల్సిన అరుణ్‌జైట్లీ పర్యటన ఖరారు కాకపోవడం కొంత ఉత్కంఠ రేపుతోంది.