ఆగస్టు 14 అర్ధరాత్రే డెడ్‌లైన్‌ | Kcr Orders To Start Mission Bhagiratha On August 14 | Sakshi
Sakshi News home page

ఆగస్టు 14 అర్ధరాత్రే డెడ్‌లైన్‌

Published Fri, Jul 20 2018 2:41 AM | Last Updated on Wed, Aug 15 2018 9:10 PM

Kcr Orders To Start Mission Bhagiratha On August 14 - Sakshi

సాక్షి, హైదరాబాద్ ‌: ‘‘మిషన్‌ భగీరథ ప్రాజెక్టు పనుల్లో వేగం పెంచండి. ఆగస్టు 14 అర్థరాత్రిని డెడ్‌ లైన్‌గా పెట్టుకుని, ఆలోగా అన్ని గ్రామాలకూ బల్క్‌గా నీరందించేలా పనుల్లో వేగం పెంచండి’’అని అధికారులను ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆదేశించారు. 60 నుంచి 80 రోజుల్లో మిగతా పనులు కూడా నూటికి నూరు శాతం పూర్తయేలా పని చేయాలని నిర్దేశించారు. మిషన్‌ భగీరథ పనుల పురోగతిని గురువారం ప్రగతి భవన్‌లో ఆయన సమీక్షించారు.

ప్రాజెక్టులో మెజారిటీ పనులు పూర్తయ్యాయని, వేలాది గ్రామాలకు ఇప్పటికే నీరు వస్తోందని సీఎం అన్నారు. గ్రామాల్లో అంతర్గత పనులతో పాటు, మరికొన్ని పనులు మాత్రమే మిగిలి ఉన్నాయన్నారు. పనులు పూర్తయిన చోట బాలారిష్టాలను ఎప్పటికప్పుడు పరిష్కరించుకుంటూ పోవాలని సూచించారు. పనుల్లో వేగం, నాణ్యత పెంచడానికి, మిషన్‌ భగీరథను మరింత సమర్థంగా, సమన్వయంతో నిర్వహించేందుకు ఆర్‌డబ్లు్యఎస్‌ శాఖను పునర్‌ వ్యవస్థీకరించాలని సీఎం నిర్ణయించారు.

సమాంతరంగా అంతర్గత పనులు
భగీరథ అంతర్గత పనులు కూడా సమాంతరంగా కొనసాగాలని, మరో నెలన్నరలో అవీ పూర్తవాలని సీఎం సూచించారు. ‘‘1.5 లక్షల కి.మీ. పొడవైన పైపులైను, 1,400 మోటార్లు, 180 మెగావాట్ల విద్యుత్, రాష్ట్రవ్యాప్తంగా విస్తరించిన పెద్ద ప్రాజెక్టు కావడంతో అక్కడక్కడ వాల్వ్‌ల లీకేజీ వంటి సమస్యలు సహజం. వీటిని ఎప్పటికప్పుడు పరిష్కరించుకుంటూ పోవాలి. పనుల్లో నిర్లక్ష్యం చూపే ఏజన్సీలు, అధికారులపై కఠినంగా వ్యవహరించండి’’అని ఆదేశించారు. ‘‘ఆర్‌డబ్లు్యఎస్‌ ఇంజనీర్‌ ఇన్‌ చీఫ్‌ సురేందర్‌రెడ్డిని మిషన్‌ భగీరథ సలహాదారుగా, సీఈ కృపాకర్‌ రెడ్డిని ఈఎన్‌సీగా నియమించండి. ఆర్‌డబ్ల్యూఎస్‌లో ఉన్న సీఈల సంఖ్యను 4 నుంచి 9కి పెంచండి.

వారి పరిధి నిర్ణయించడంతో పాటు, సెగ్మెంట్లవారీగా పనుల షెడ్యూల్‌ను శుక్రవారం మధ్యాహ్నానికల్లా నిర్థారించండి. భగీరథ పనులు చేస్తున్న వర్క్‌ ఏజెన్సీలకు బిల్లులు ఎట్టి పరిస్థితుల్లో పెండింగ్‌ పెట్టొద్దు. పనులను రోజూ పర్యవేక్షించి సకాలంలో పూర్తి చేయండి. పనులు ఎక్కడ పూర్తయితే అక్కడ నీరు సరఫరా చేస్తూ వెళ్లండి. విద్యుత్‌ శాఖ సబ్‌ స్టేషన్లు, పంపు హౌజుల నిర్మాణానికి సిబ్బందిని నియమించండి. లో వోల్టేజీ సమస్య రాకుండా చూసుకోండి. విద్యుత లైన్లను ప్రాజెక్టుకు అనుసంధానం చేయడంపై విద్యుత్‌ శాఖ, భగీరథ అధికారులు సమన్వయంతో తుది చర్యలు తీసుకోండి’’అని ఆదేశించారు. సమీక్షలో మిషన్‌ భగీరథ వైస్‌ చైర్మన్‌ వేముల ప్రశాంత్‌రెడ్డి ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

గడువుకు ముందే పూర్తయిన విద్యుత్‌ పనులు
మిషన్‌ భగీరథ పథకానికి విద్యుత్‌ సరఫరా వ్యవస్థను నిర్ణీత గడువుకు ముందే విద్యుత్‌ సంస్థలు వంద శాతం సిద్ధం చేశాయి. రాష్ట్రవ్యాప్తంగా భగీరథ పంపుసెట్లు నడవడానికి రూ.280 కోట్ల వ్యయంతో కొత్త సబ్‌ స్టేషన్లు, పవర్‌ లైన్లు, ట్రాన్స్‌ఫార్మర్లు ఏర్పాటు చేసినట్లు ట్రాన్స్‌ కో, జెన్‌ కో సీఎండీ ప్రభాకర్‌రావు వెల్లడించారు. విద్యుత్‌ సంస్థలు చేసిన ఏర్పాట్లపై సమగ్ర నివేదికను ఆయన కేసీఆర్‌కు అందజేశారు. ‘‘భగీరథ విద్యుత్‌ వ్యవస్థలన్నీ 2018 ఆగస్టు 15 నాటికి పూర్తవ్వాలని సీఎం గడువు విధించారు. అంతకు నెల ముందే జూలై 15 నాటికే పనులన్నీ పూర్తి చేసి భగీరథ పథకానికి అప్పగించాం. 180 మెగావాట్ల విద్యుత్‌ను నిరంతరాయంగా అందించడానికి ఏర్పాట్లు చేశాం. డెడికేటెడ్‌ లైన్లు కూడా వేశాం.

ట్రాన్స్‌కో ఆధ్వర్యంలో మహబూబ్‌నగర్‌ జిల్లా గౌరిదేవిపల్లి, నాగర్‌కర్నూల్‌ జిల్లా ఎల్లూరులో 220/11 కేవీ సబ్‌స్టేషన్లు నిర్మించాం. 44 సబ్‌స్టేషన్లు, 603.57 కి.మీ. మేర 33 కేవీ లైన్లు, 603.3 కి.మీ. 11 కేవీ లైన్లు, 46 పవర్‌ ట్రాన్స్‌ఫార్మర్లు, 314 డిస్ట్రిబ్యూటరీ ట్రాన్స్‌ఫార్మర్లు ఏర్పాటు చేశాం. ఉమ్మడి హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్, మహబూబ్‌ నగర్, నల్గొండ జిల్లాల్లో రెండు 220/11 కేవీ స్టేషన్లు, పదహారు 33/11 స్టేషన్లు, 249.94 కి.మీ. 33 కేవీ లైన్లు, 254.94 కి.మీ. 11 కేవీ లైన్లు, 126 డిస్ట్రిబ్యూటరీ ట్రాన్స్‌ఫార్మర్లు ఏర్పాటు చేశాం. ఉమ్మడి వరంగల్, కరీంనగర్, ఖమ్మం, నిజామాబాద్, ఆదిలాబాద్‌ జిల్లాల్లో 33/11 కేవీ స్టేషన్లు 26, 353.63 కి.మీ. 33 కేవీ లైన్లు, 348.36 కి.మీ. 11 కేవీ లైన్లు, 46 పవర్‌ ట్రాన్స్‌ఫార్మర్లు, 188 డిస్ట్రిబ్యూటరీ ట్రాన్స్‌ఫార్మర్లు ఏర్పాటు చేశాం. ఇవన్నీ 24 గంటల పర్యవేక్షణతో నిరంతరాయంగా పనిచేస్తాయి’’అని పేర్కొన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement