తెలంగాణకు ప్రత్యేక పారిశ్రామిక విధానం
* సింగిల్ విండో ద్వారా అనుమతులు
* టీఎస్‌ఐసీసీ ఏర్పాటుకు చర్యలు: కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేక పారిశ్రామిక విధానాన్ని రూపొందించాలని పరిశ్రమల శాఖ అధికారులను సీఎం కె. చంద్రశేఖర్ రావు ఆదేశించారు. దేశంలోనే అత్యుత్తమ విధానాన్ని రూపొందించాలని సూచించారు. జాతీయ, అంతర్జాతీయ కంపెనీలను ఆకర్షించడంతో పాటు మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యమివ్వాలన్నారు. తెలంగాణ దృక్పథంతో పారిశ్రామిక విధానం ఉండాలని, ఇందుకోసం త్వరలోనే సీఐఐ, ఫిక్కీ తదితర సంస్థలతో సమావేశాన్ని ఏర్పాటు చేయాలని కూడా కేసీఆర్ ఆదేశించారు. పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ప్రదీప్ చంద్ర, ఇతర ఉన్నతాధికారులతో సచివాలయంలో కేసీఆర్ శుక్రవారం సమీక్ష జరిపారు. సింగిల్ విండో ద్వారా పరిశ్రమలకు అన్ని అనుమతులు అందేలా ఏర్పాట్లు చేయాలని స్పష్టం చేశారు.
పారిశ్రామికవేత్తలను ఆహ్వానించి 15-20 రోజుల్లోగా అన్ని అనుమతులు వచ్చేలా చూడాలన్నారు. ఇందుకోసం ముఖ్యమంత్రి కార్యాలయంలో ప్రత్యేక ఛేజింగ్ సెల్‌ను ఏర్పాటు చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు. కాలుష్యరహిత పారిశ్రామికవాడలను ఏర్పాటు చేయాలని, తెలంగాణలో ఉద్యోగావకాశాలను పెంచడమే లక్ష్యంగా పారిశ్రామికీకరణ జరగాలని అధికారులకు సూచించారు. అలాగే పరిశ్రమలకు విద్యుత్ లోటు లేకుండా చూడాలన్నారు. గతంలో భూములు తీసుకుని పరిశ్రమలను ఏర్పాటు చేయని సంస్థల నుంచి ఆ భూములను వెనక్కి తీసుకోవాలని ఆదేశించారు. వ్యవసాయానికి పనికిరాని భూములను గుర్తించి అందులోనే పరిశ్రమల ఏర్పాటు జరిగేలా చూడాలన్నారు. ఏపీఐఐసీలో తెలంగాణ డివిజన్‌ను టీఎస్‌ఐఐసీగాా మార్చాలని, వరంగల్‌లోని అజంజాహి భూములను టెక్స్‌టైల్ పార్కుగా మార్చాలని, దీన్ని తమిళనాడులోని తిరుపూర్ తరహాలో అభివృద్ధి చేయాలని కేసీఆర్ సూచించారు.