
ముందు చంద్రబాబును నిలదీయండి: కేటీఆర్
శ్రీశైలం నుంచి విద్యుత్ రాకుండా అడ్డుకుంటూ ఏపీ సీఎం చంద్రబాబు తెలంగాణకు ద్రోహం చేస్తున్నాడనీ..
టీ టీడీపీ నేతలకు కేటీఆర్ హితవు
సాక్షి, న్యూఢిల్లీ : శ్రీశైలం నుంచి విద్యుత్ రాకుండా అడ్డుకుంటూ ఏపీ సీఎం చంద్రబాబు తెలంగాణకు ద్రోహం చేస్తున్నాడనీ, ముందుగా మీ నేతను నిలదీయండని తెలంగాణ ఐటీ మంత్రి కె. తారకరామారావు టీ-టీడీపీ నేతలను కోరారు. అత్యుత్తమ మౌలిక వసతులు ఉన్న రాష్ట్రంగా తెలంగాణకు ‘ఇండియా టుడే’ అందజేసిన అవార్డును మంత్రి కేటీఆర్ శుక్రవారం స్వీకరించిన అనంతరం మీడియాతో మాట్లాడారు.
తెలంగాణ ప్రభుత్వం రైతాంగాన్ని పట్టించుకోవడంలేదని, రైతాంగాన్ని ఆదుకోవాలని టీటీడీపీ నేతల బృందం కేంద్రానికి విజ్ఞప్తి చేసిన విషయమై ప్రస్తావించగా.. ‘తెలంగాణను అంధకారంలోకి నెట్టేలా వ్యవహరిస్తున్న చంద్రబాబును నిలదీసి, అనంతరం ఢిల్లీకి వచ్చి విజ్ఞప్తిచేస్తే అర్థం ఉంటుందని టీటీడీపీ నేతలకు సూచిస్తున్నా’ అని అన్నారు.
వెంకయ్య, రవిశంకర్ ప్రసాద్‌లకు వినతులు: కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రి వెంకయ్యనాయుడు, ఐటీ, న్యాయ మంత్రి రవిశంకర్ ప్రసాద్‌లను కలిసి తెలంగాణలో ఐటీ, పట్టణాభివృద్ధికి కేంద్రం సహకరించాలని వినతి పత్రాలను అందచేసినట్టు మంత్రి కేటీఆర్ చెప్పారు. కొత్తగా ఏర్పాటైన తెలంగాణ అభివృద్ధికి చేయూతనివ్వాలని కోరానన్నారు.