జనం మదిలో ఏముంది?
► రెండున్నరేళ్ల పాలనపై ఏమనుకుంటున్నారు? ఎమ్మెల్యేలను ఆరా తీస్తున్న సీఎం కేసీఆర్
► ఒక్కో జిల్లాకు చెందిన శాసనసభ్యులతో ప్రత్యేక భేటీలు
► ఇప్పటికే మూడు జిల్లాల ఎమ్మెల్యేలతో సమావేశం
► అభివృద్ధి, సంక్షేమ పథకాలపై వాకబు.. ప్రతిపక్ష పార్టీల పరిస్థితిపైనా చర్చ
► ప్రజలతో కలసి పనిచేయాలని సూచనలు
సాక్షి, హైదరాబాద్
రెండున్నరేళ్ల పాలనపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు స్వీయ సమీక్ష చేసుకుంటున్నారా? ఇందుకు ఆయనే స్వయంగా రంగంలోకి దిగారా? క్షేత్రస్థాయి వాస్తవాలపై ఎమ్మెల్యేలను ఆరా తీస్తున్నారా? అధికార పార్టీ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం ప్రకారం ఇందుకు అవుననే సమాధానం వస్తోంది! ‘ప్రజలు ఏమనుకుంటున్నారు’ అన్న ప్రశ్న చుట్టూ సమాధానాలు రాబట్టే పనిలో సీఎం తలమునకలయ్యారు. ఇందుకు ఆయన ఒక్కో జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలతో ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తున్నారు.
ఇప్పటికే మూడు జిల్లాల ఎమ్మెల్యేలతో ఈ భేటీలు ముగిశాయి. ‘‘మీ జిల్లా పరిస్థితి ఏంటి? మనం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై ప్రజలు ఏమనుకుంటున్నారు? క్షేత్ర స్థాయిలో ప్రజలు సంతృప్తిగా ఉన్నారా?’’ అంటూ సీఎం కేసీఆర్ స్వయంగా ఎమ్మెల్యేలను అడిగి తెలుసుకుంటున్నారు. రెండున్నరేళ్ల పాలన తీరుపై నేరుగా సమాచారం సేకరిస్తున్నారు.
ప్రభుత్వ పథకాలపై ఆరా..
గడచిన రెండున్నరేళ్లుగా రాష్ట్రంలో చేపట్టిన అభివృద్ధి పనులతోపాటు సంక్షేమ కార్యక్రమాలపై ప్రజలు ఏమనుకుంటున్నారన్న అంశంపై సీఎం ప్రత్యేక దృష్టి సారించారు. ప్రధానంగా డబుల్ బెడ్‌రూం ఇళ్లపై నియోజకవర్గాల్లో ప్రజల మనోగతం తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. కొందరు ఎమ్మెల్యేలు డబుల్ బెడ్‌రూం ఇళ్ల మంజూరీపై కొంత అసంతృప్తి ఉందని చెప్పారు. రూ.వెయ్యి చొప్పున ఇస్తున్న పెన్షన్లపై ఎలాంటి అభిప్రాయం ఉందని కూడా సీఎం అడిగి తెలుసుకున్నారు. రాష్ట్రంలో కోటి ఎకరాలకు సాగునీరు ఇవ్వాలని ప్రయత్నం చేస్తున్నామని, కానీ కాంగ్రెస్ పార్టీ కేసులతో ప్రభుత్వం కాళ్లలో కట్టెలు పెడుతోందని ఎమ్మెల్యేలతో సీఎం అన్నట్లు సమాచారం.
ఈ అంశంపై ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేయాలని సూచించారు. దీనిపై ఎమ్మెల్యేలుగా నియోజకవర్గాల్లో ఏం చేశారని కూడా అడిగినట్లు తెలిసింది. సీఎంవోకు చెందిన ఒకర్దిదరు అధికారులు మినహా ఇతర అధికారులెవరూ లేకుండానే ఎమ్మెల్యేలతో ఈ భేటీలు జరుగుతున్నాయి. నియోజకవర్గాల్లో అధికారుల పనితీరు ఎలా ఉంది? వారు సహకరిస్తున్నారా.. లేదా? అన్న విషయాలు అడిగి తెలుసుకుంటున్నారని వినికిడి. మరో రెండున్నరేళ్లలోనే ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ఇప్పట్నుంచే నియోజకవర్గాల పరిస్థితిపై సీఎం ఓ అంచనాకు వచ్చేందుకు ప్రయత్నిస్తున్నారని అభిప్రాయపడుతున్నారు.
ఓడిన అభ్యర్థి ఎవరు? ఏం చేస్తున్నారు?
నియోజకవర్గాల్లో ప్రతిపక్ష పార్టీల పరిస్థితిపైనా సీఎం వివరాలు తెలుసుకుంటున్నారు. ఇప్పటిదాకా వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల ఎమ్మెల్యేలతో జరిగిన సమావేశాల్లో పూర్తిస్థాయిలో ఈ వివరాలు తెలుసుకున్నారని చెబుతున్నారు. గత ఎన్నికల్లో ఓడిపోయిన అభ్యర్థి ఎవరు? ఏ పార్టీ? వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏమైనా ఆందోళనలు చేశారా? వాటిలో ప్రజలు ఏ స్థాయిలో పాల్గొంటున్నారు.. వంటి సమచారాన్ని కూడా అడిగి తెలుసుకున్నారని సమాచారం. ఒక్కో జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలను పిలిపించి అందరి ఎదుటే జిల్లాతోపాటు నియోజకవర్గం పరిస్థితిపైనా చర్చిస్తున్నారు. ఇతర పార్టీల నుంచి టీఆర్‌ఎస్‌లోకి వచ్చిన ఎమ్మెల్యేలతో మాత్రం ప్రత్యేకంగా ముఖాముఖి మాట్లాడుతున్నట్లు తెలిసింది. ఇప్పటికే హైదరాబాద్‌కు వచ్చే ప్రతి ఎమ్మెల్యే విధిగా క్యాంపు కార్యాలయంలో తనను కలిసేలా ఏర్పాట్లు చేసినట్లు సమాచారం.
సమస్యలేంటి? పరిష్కారం ఎలా?
సమావేశాల్లో పాల్గొంటున్న ఎమ్మెల్యేలతో వారి నియోజకవర్గాల్లోని సమస్యలపైనా సీఎం చర్చిస్తున్నారు. ఏం పనులు కావాలి? ఎలాంటి సమస్యలు ఉన్నాయి? వాటిని ఎలా పరిష్కరించాలి? అని ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వ పథకాలు అర్హులకే అందుతున్నాయా? మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ వంటి ప్రభుత్వ ప్రతిష్టాత్మక పథకాలపై ప్రజలు ఏమనుకుంటున్నారు? ఇంకా ఏమైనా కొత్త పథకాలు చేపట్టాలా? అన్న అంశంపైనా సీఎం ఎమ్మెల్యేలతో చర్చిస్తున్నారు. ఒకవైపు ప్రభుత్వ పనితీరును తెలుసుకుంటూనే ఎమ్మెల్యేల పనితీరును కూడా బేరీజు వేస్తున్నారని సమాచారం. హైదరాబాద్‌లో, నియోజకవర్గ కేంద్రాల్లోనో ఉంటున్నారా? నియోజకవర్గాల్లో పర్యటిస్తున్నారా? అని కూడా ప్రశ్నిస్తున్నారు.
నియోజకవర్గాల్లో తమ పరిస్థితి బాగానే ఉందని కొందరు ఎమ్మెల్యేలు జవాబు ఇవ్వగా.. తన వద్ద ఉన్న రిపోర్టు అలా లేదని, జాగ్రత్తగా చూసుకోండని వారికి సీఎం సలహా ఇచ్చారని తెలిసింది. ప్రజలతో కలిసి పనిచేసేందుకు ఎమ్మెల్యేలకు సలహాలు, సూచనలు కూడా ఇస్తున్నారు. మొత్తంగా చాలా ముందుగానే ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న అభిప్రాయాన్ని, అసెంబ్లీ నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితిని తెలుసుకోవడం, తమను పిలిచి మాట్లాడడంపై ఎమ్మెల్యేల్లో ఆనందం వ్యక్తమవుతోంది. ఇదంతా భవిష్యత్ ఎన్నికల ప్రణాళికను పకడ్బందీగా తయారు చేసుకునేందుకు జరుగుతున్న కసరత్తులో భాగమేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.