మధ్యంతర బడ్జెట్‌ పెడదామా? | KCR Thinking About Budget For 2019 Economic Year | Sakshi
Sakshi News home page

లేదా పూర్తి స్థాయి బడ్జెట్‌ ఉండాలా? 

Published Sun, Dec 30 2018 2:23 AM | Last Updated on Sun, Dec 30 2018 2:23 AM

KCR Thinking About Budget For 2019 Economic Year - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: పార్లమెంటు ఎన్నికల దృష్ట్యా కేంద్రం ఈ సారి ఓట్‌ ఆన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ ప్రవేశ పెడుతుందని, ఈ నేపథ్యంలో రాష్ట్ర బడ్జెట్‌ పూర్తి స్థాయిలో ఉండాలా? మధ్యంతర బడ్జెట్‌ పెట్టుకోవాలా? అనే విషయాలపై అధ్యయనం చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆదేశించారు. ‘కేంద్రం ఓట్‌ ఆన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ ప్రవేశపెడితే రాష్ట్రాలకు ఏం ఇస్తారో తెలియదు. ఆ పరిస్థితుల్లో తెలంగాణకు పూర్తిస్థాయి బడ్జెట్‌ పెట్టాలా.. మధ్యంతర బడ్జెట్‌ పెట్టుకుని, కేంద్రంలో కొత్తగా ఏర్పడే ప్రభుత్వం అనుసరించే విధానానికి అనుగుణంగా తిరిగి బడ్జెట్‌ పెట్టుకోవాలా.. అనే దానిపై అధ్యయనం చేయాలి’అని సీనియర్‌ అధికారులకు సీఎం సూచించారు. నీటి పారుదల ప్రాజెక్టుల నిర్మాణం, వైద్యశిబిరాల నిర్వహణ, పంచాయతీ ఎన్నికల నిర్వహణ, బడ్జెట్‌ రూపకల్పన తదితర అంశాలపై సీఎం కేసీఆర్‌ శనివారం ప్రగతి భవన్‌లో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. నీటిపారుదల రంగానికి ప్రస్తుతం ఇస్తున్న ప్రాధాన్యాన్ని కొనసాగిస్తూనే, విద్య, వైద్య రంగాలకు ఈసారి అత్యధిక ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు వెల్లడించారు. కంటి వెలుగు శిబిరాలు నిర్వహించినట్లే చెవి, ముక్కు, గొంతు, దంత పరీక్షలు కూడా నిర్వహించాలని ఆదేశించారు. పెన్షన్లతో పాటు ఎన్నికల సమయంలో ప్రజలకిచ్చిన ప్రతీ హామీని అమలు చేయాల్సి ఉన్నందున, బడ్జెట్‌లో కేటాయింపులు జరపాలని సూచించారు. ఎన్నికల్లో ఇ చ్చిన హామీ మేరకు పెన్షనర్ల కోసం ప్రత్యేక డైరెక్టరేట్‌ ఏర్పాటు చేసేందుకు పదవీ విరమణ పొందిన ఉద్యోగులతో మాట్లాడి సూచనలు తీసుకోవాల న్నారు. పంచాయతీ ఎన్నికల నిర్వహణకు ప్రభు త్వం పూర్తిగా ఏర్పాట్లు చేసిందని వివరించారు. 

ప్రతీ పౌరుడి హెల్త్‌ ప్రొఫైల్‌ 
కంటి వెలుగు శిబిరాల మాదిరిగానే ప్రజలందరికీ చెవి, గొంతు, ముక్కు, దంత పరీక్షలు నిర్వహించాలని ఆదేశించారు. ఫిబ్రవరిలో ఈ శిబిరాలు నిర్వహించేందుకు కార్యాచరణ రూపొందించాలని సూచించారు. ప్రజలందరికీ అన్ని రకాల వైద్య పరీక్షలు నిర్వహించి, ప్రతీ పౌరుడి హెల్త్‌ ప్రొఫైల్‌ రూపొందించాలని ఆదేశించారు. 

ఈ దఫా ప్రాజెక్టులన్నీ పూర్తి
కాళేశ్వరం, పాలమూరు–రంగారెడ్డి, సీతా రామ, డిండి, శ్రీరాంసాగర్‌ పునరుజ్జీవన పథకం లాంటి ఎత్తి పోతల పథకాలన్నీ ఈ దఫాలో పూర్తి చేయాలని సీఎం కేసీఆర్‌ ఆదేశించారు. ప్రస్తుతం ఏ ప్రాజెక్టు పని ఎంత వరకు వచ్చింది.. ఇంకా ఎంత మిగిలి ఉంది? దానికి ఎంత డబ్బులు కావాలి.. తదితర అంశాలపై నివేదిక తయారు చేయాలని ఆదేశించారు. సమీక్షలో ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్‌ శర్మ, సలహాదారు అనురాగ్‌ శర్మ, సీఎస్‌ ఎస్‌కే జోషి, సీనియర్‌ అధికారులు ఎస్‌.నర్సింగ్రావు, రామకృష్ణారావు, రాజేశ్వర్‌ తివారీ, వికాస్‌ రాజ్, శాంతకుమారి, స్మితా సబర్వాల్, నీతూ ప్రసాద్, ప్రభుత్వ విప్‌ పల్లా రాజేశ్వర్రెడ్డి, ఎండీసీ చైర్మన్‌ శేరి సుభాష్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement