
ఆరు రోజులు.. గులాబీ కూలీలు!
పార్టీ శ్రేణులు 14 నుంచి 20వ తేదీ మధ్య రెండు రోజులు కూలి పని చేయాలి: కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: టీఆర్‌ఎస్ 16వ ఆవిర్భావ దినం సందర్భంగా ఈ నెల 27న వరంగల్‌లో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నామని... ఆ సభకు వచ్చే పార్టీ కార్యకర్తలు కూలీ పనిచేసి ఖర్చులు సంపాదించుకోవాలని టీఆర్‌ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ సూచించారు. బహిరంగ సభకు ముందు 21వ తేదీన హైదరాబాద్‌లో పార్టీ ప్లీనరీ జరుగుతుందని చెప్పారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి ఎన్నిక ఆనవాయితీ ప్రకారం ఈసారి కూడా మంత్రి నాయిని నర్సింహారెడ్డి ఆధ్వర్యంలో జరుగుతుందని, ఎన్నికల షెడ్యూల్‌ను ఆయనే ప్రకటిస్తారని తెలిపారు.
బుధవారం ప్రగతిభవన్‌లో జరిగిన కేబినెట్ భేటీ అనంతరం కేసీఆర్ విలేకరులతో మాట్లాడారు. పధ్నాలుగేళ్ల ఉద్యమం తర్వాత రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన టీఆర్‌ఎస్.. మొదట 51.5 లక్షల సభ్యత్వాలు చేసుకుందని తెలిపారు. అధికారంలోకి వచ్చిన మూడేళ్ల తర్వాత అదే సభ్యత్వం 75 లక్షలు దాటిపోతోందని చెప్పారు. సభ్యత్వాలకు ప్రజల్లో అద్భుతమైన స్పందన ఉందని, రుసుము పెంచినా సభ్యత్వం పెరుగుతోందని వ్యాఖ్యానించారు. దేశంలో అత్యధిక సంఖ్యలో సభ్యులున్న అతికొద్ది పార్టీల్లో టీఆర్‌ఎస్ ఒకటిగా అవతరించిందని పేర్కొన్నారు. సభ్యత్వ రుసుము ద్వారా రూ.25 కోట్ల నుంచి రూ.35 కోట్ల వరకు సమకూరనుం దని, ఇప్పటికే పార్టీ ప్రధాన కార్యాలయానికి రూ.13.5 కోట్లు అందాయని తెలిపారు.
నియోజకవర్గాల పెంపు జరుగుతుంది
అసెంబ్లీ నియోజకవర్గాల పెంపు అంశాన్నీ కేసీఆర్ ప్రస్తావించారు. ‘‘నియోజకవర్గాల పెంపు వంద శాతం జరగబోతోంది. దీనిపై నాకు సమాచారం ఉంది. పార్లమెంటు సమావేశాలు అయిపోయినా ఇబ్బంది ఉండదు. ఆర్డినెన్స్ తేవచ్చు..’అని చెప్పారు. కేబినెట్ విస్తరణపై ప్రశ్నించగా.. ‘అది చేసిన చంద్రబాబే తలపట్టుకున్నడు..’అని కేసీఆర్ వ్యాఖ్యానించారు. ఉస్మానియా వర్సిటీ వందేళ్ల ఉత్సవాల నేపథ్యంలో.. హైదరాబాద్‌లో ఇబ్బంది ఉండకూడదనే ఉద్దేశంతో ప్లీనరీని, బహిరంగ సభను వేర్వేరుగా నిర్వహిస్తున్నామని చెప్పారు. ఈనెల 26న ఉస్మానియా ఉత్సవాల్లో రాష్ట్రపతితో పాటు తాను కూడా పాల్గొంటానని తెలిపారు.
నూరు శాతం మేనిఫెస్టో అమలు చేశాం..
దేశవ్యాప్తంగా ఏ రాజకీయ పార్టీ సాధించని ఘనతను టీఆర్‌ఎస్ సాధించిందని.. ఎన్నికల మేనిఫెస్టోను నూటికి నూరుశాతం అమలు చేశామని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. మేనిఫెస్టోలో చెప్పని కల్యాణలక్ష్మి, బీడీ కార్మికుల పెన్షన్లు, విదేశీ విద్యకు ఉపకార వేతనం, స్కూళ్లు, హాస్టళ్లకు సన్నబియ్యం వంటివాటినీ అమలు చేశామన్నారు.
2019 ఎన్నికల్లో తాము అధికారంలోకి వస్తే రైతుల రుణాలను ఒకేసారి మాఫీ చేస్తామన్న పీసీసీ చీఫ్ ఉత్తమ్ ప్రకటనను విలేకరులు ప్రస్తావించగా.. ‘వారు వచ్చేదుందా..? చచ్చేదుందా..’అని కేసీఆర్ కొట్టిపారేశారు. తాము అధికారంలోకి వస్తే ప్రగతిభవన్‌ను ఆస్పత్రిగా మారుస్తామన్న టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి ప్రకటనపైనా సీఎం స్పందించారు. ‘ఎవరిది హాస్పిటల్ అయిందో తెలుస్త లేదా.. ఇప్పుడు ఏముందక్కడ..’ అని ఎన్టీఆర్ ట్రస్ట్‌భవన్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.
నేనూ కూలి పని చేస్తా..
టీఆర్‌ఎస్ రాష్ట్ర అధ్యక్షుడి నుంచి కార్యకర్తల దాకా అందరూ కూలి చేసి బహిరంగ సభ కోసం డబ్బు సమకూర్చుకోవాలని కేసీఆర్ సూచించారు. తాను కూడా రెండు రోజుల పాటు కూలీ చేస్తానన్నారు. ఈనెల 14వ తేదీ నుంచి 20వ తేదీవరకు గులాబీ కూలీ దినాలుగా ప్రకటిస్తున్నానని.. ఆ ఆరు రోజుల వ్యవధిలో కనీసం రెండు రోజుల పాటు కూలీ చేయాలని పేర్కొన్నారు.
దేశంలో నంబర్ వన్ సంక్షేమ రాష్ట్రంగా తెలంగాణ గుర్తింపు పొందిందని, ఇక్కడ అమలు చేస్తున్న పథకాలపై ఇతర రాష్ట్రాలు అధ్యయనం చేసి వెళుతున్నాయని కేసీఆర్ చెప్పారు. ఈ నేపథ్యంలో జరుగుతున్న వరంగల్ సభను కనీవినీ ఎరుగని రీతిలో విజయవంతం చేసుకోవాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. కేటీఆర్‌కు టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఇస్తున్నారన్న ఊహాగానాలను విలేకరులు ప్రస్తావించగా.. ‘మీరే ఊహాగానం అంటున్నారు కదా..? ఊహగానంగానే ఉండనీయండి..’ అని కేసీఆర్ పేర్కొన్నారు.