
సాక్షి, సిటీబ్యూరో: ‘తెలంగాణలో నాటక రంగం మరింత బలపడాలని మా తండ్రి ఖదీర్ అలీ బేగ్ ఎప్పుడూ తలంచేవారు. అందుకోసం 14ఏళ్లుగా ఖదీర్ అలీ బేగ్ థియేటర్ ఫెస్టివల్‌ను నిర్వహిస్తున్నాం. ప్రతిఏటా థియేటర్ ఫెస్టివల్‌తో ఆయన్ని గుర్తు చేస్తున్నాం. యాంత్రిక జీవనంతో ఒత్తిడికి గురవుతున్న సిటీజనులకు ఓ మంచి వినోదం అందించాలని ఖదీర్ అలీ బేగ్ తపించేవారు. ఆయన ఆశయాలను కొనసాగించాలని కష్టాలు ఎదురైనా ఫెస్ట్ నిర్వహిస్తున్నామ’ని థియేటర్ ఫెస్టివల్ నిర్వాహకులు, ప్రముఖ నాటక దర్శకుడు మహ్మద్ అలీ బేగ్ ‘సాక్షి’తో చెప్పారు.
2005లో ఏర్పాటు...
‘మా త్రండి హైదరాబాద్ నుంచి ప్రముఖ థియేటర్ ఆర్టిస్ట్‌గా గుర్తింపు పొందారు. 1970లో న్యూ థియేటర్ ఆఫ్ హైదరాబాద్ ‘ఎన్‌టీహెచ్ స్థాపించారు. సఖరం బైండర్, అధే అడోహోరే, ఖమోష్ అడాలాత్ జారి హై, కెహ్రాన్ కే రాజాన్స్ తదితర నాటకాల్లో నటించారు. ఆనాడు ఆయన వేసిన సెట్లు అందర్నీ ఆకట్టుకునేవి. 2005లో ఖదీర్ అలీ బేగ్ థియేటర్ ఫెస్టివల్ ఫౌండేషన్‌ను స్థాపించి ఎన్నో థియేటర్ ఫెస్టివల్స్ నిర్వహించాం. మరెన్నో చారిటీ కార్యక్రమాలు ఏర్పాటు చేశామ’ని మహ్మద్ అలీ బేగ్ చెప్పారు.
150 మంది కళాకారులతో...
ఈ థియేటర్ ఫెస్టివల్ రవీంద్రభారతిలో గురువారం ప్రారంభమైంది. ఈ నెల 4వరకు కొనసాగుతుంది. ఇందులో దాదాపు 150 మంది కళాకారులు పాల్గొంటున్నారు. అస్మిత థియేటర్ గ్రూప్ ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన తారా హిందీ నాటకం ఆకట్టుకుంది. 2న డ్రీమ్జ్ సెహర్, 3న ‘ల’మెంట్ (దిలవర్), 4న హౌ ఐ మెట్ యువర్ ఫాదర్ నాటకాలను ప్రదర్శించనున్నారు. ఈ నాటకాల్లో ఒగ్గు డోలు, చిందు యక్షగానం కూడా ప్రదర్శిస్తున్నట్లు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment