కష్టాల్లో ఖరీఫ్..
బాన్సువాడ : జిల్లాలో ఈ ఏడాది ఖరీఫ్ సీజన్ నిరాశాజనకం గా మారింది.ఆశించిన వర్షాలు లేక రైతులకు ప్రతి కూల పరిస్థితులు ఎదురవుతున్నాయి. జూన్ ముగుస్తున్నా ఇంత వరకు జిల్లాలో సాధారణ ఖరీఫ్ సాగు విస్తీర్ణంలో 25 శాతం మించి పంటలు సాగుకు నోచుకోలేదు. సాగైన పంటలు కూడా ఎండ దెబ్బకు వాడిపోతున్నాయి.ఖరీఫ్ ఆరంభంలో సాగుచేసే తక్కువ కాలం పంటల సాగునోచుకోక సుమారు రూ.50 కోట్ల రాబడిని రైతాంగం కోల్పోయే పరిస్థితి ఏర్పడింది.
ఇదీ పరిస్థితి...
ఖరీఫ్ పంటల సాగుపై రైతాంగంలో ఆందోళన కనిపిస్తున్నది. జిల్లాలో ఖరీఫ్ సీజన్‌లో సోయా 1.24 లక్షల హెక్టార్లలో, వరి 1.52 లక్షల హెక్టార్లలో, మొక్కజొన్న 57వేల హెక్టార్లలో సాగుచేయాల్సి ఉంది. అత్యధికం గా వరి పంట 1.50 హెక్టార్లు సాగుచేస్తారు. మిగిలిన వివిధ రకాల పంటలు, పశుగ్రాస పంటలు సుమారు మరో 20 వేల హెక్టార్ల వరకు ఉంటాయి. ఇప్పటి వరకు కేవలం పది శాతం పంటలు కూడా సాగుకు నోచుకోలేదు.సాధారణంగా మే నెలలో కురిసే జల్లులతో దుక్కులు దున్ని రైతులు సిద్ధమవుతారు. జూన్ మొదటి వారంలో సోయా, పత్తి విత్తనాలను వేస్తారు. రెండవ వారం నుంచి కీలకమైన ఖరీఫ్ పంటలైన వరి, మొక్కజొన్న పంటలను జిల్లా రైతులు సాగుచేస్తారు.
సోయా సాగుకు మొగ్గు...
వర్షాలు కురవకపోవడంతో సోయావైపు రైతులు మొగ్గుచూపుతున్నారు. తొలకరిలో సాగుచేసే పంటలు మూడు నెలల్లో చేతికి వస్తాయి. అదే భూమిలో రబీలో సోయా , పొద్దుతిరుగుడు ఇతరత్రా పంటలు సాగుచేస్తారు. ఆ విధంగా మే ఆఖరు నుంచి జూన్ మూడవ వారంలోపు జిల్లాలో సుమారు 2లక్షల హెక్టార్లలో తొలకరి పంటలను సాగుచేస్తారు. తొలకరి పంటలకు సక్రమంగా వాతావరణం అనుకూలిస్తే పెట్టిన పెట్టుబడులు పోనూ హెక్టారుకు సుమారు రూ. 25వేల నుంచి రూ.30 వేల వరకు ఆదాయం లభిస్తుంది. దానిని ఆ భూముల్లో రబీలో సాగుచేసే పంటలకు పెట్టుబడులుగా జిల్లారైతులు వాడుకొంటారు. అలాం టిది ఈ ఏడాది జిల్లాలో మే, జూన్ నెలల్లో వర్షాలు లేక తొలకరి సాగు నిలిచిపోయింది. జిల్లాలో జూన్‌లో 131 మిల్లీ మీటర్లు వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా, ఈ సీజన్‌లో కేవలం 60.05 మిల్లీమీటర్ల వర్షాపాతం మాత్రమే నమోదైంది. వర్షాభావ పరిస్థితులతో జిల్లాలో పశుగ్రాస సమస్య తీవ్రమైంది.
బోర్లకు అందని నీరు...
జిల్లాలో విద్యుత్ కోతల వల్ల బోర్లు, బావులను ఆధారంగా చేసుకొని పంటలు సాగుచేస్తున్న రైతులకు ఇబ్బందులు తప్పడం లేదు. బాన్సువాడ, కామారెడ్డి, ఆర్మూర్, బోధన్ సబ్ డివిజన్లలో అధిక శాతం రైతులు బోర్లపైనే ఆధారపడి పంటలు సాగుచేస్తున్నారు. ఆయా ప్రాంతాల్లో వరినాట్లు వేసుకున్న రైతులు కరెంటుకోసం రాత్రింబవళ్లు పొలాల దగ్గరే వేచి ఉంటున్నారు. వ్యవసాయానికి ఏడు గంటల పాటు ఉచిత విద్యుత్ సరఫరా చేయాల్సి ఉండగా, ఆ మేరకు విద్యుత్ సరఫరా జరగడం లేదు. కొన్నిచోట్ల రెండు దఫాలుగా,మరికొన్నిచోట్ల మూడు దఫాలుగా విద్యు త్ సరఫరా చేస్తున్నారు. విద్యుత్ కోతలు, లోఓల్టేజీ వల్ల బోరు మోటర్లు మొరాయించి కాలిపోతున్నాయి. విద్యుత్ సరఫరా సమయమంటూ లేకపోవడంతో బోర్లపై ప్రభావం పడుతోంది. మోటార్లు కాలి, ట్రాన్స్‌ఫార్మర్లు పేలడం వల్ల రైతులు నష్టపోతున్నారు.