టీఆర్‌ఎస్ నాయకులే అసలు ముద్దాయిలు
జింకల వేట కేసు దర్యాప్తుపై కిషన్‌రెడ్డి ఫైర్
సాక్షి, హైదరాబాద్: మహదేవ్‌పూర్ జింకల వేట కేసులో అధికార పార్టీ నాయకులే అసలు ముద్దాయిలని బీజేపీ ఎమ్మెల్యే కిషన్‌రెడ్డి ఆరోపించారు. మంగళవారం ఇక్కడ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఈ వ్యవహారంలో అధికార పార్టీ నాయకులు ఉన్నందు వల్లే కేసు దర్యాప్తును పోలీసులు పక్క దారి పట్టిస్తున్నారని ఆరోపించారు. అటవీ అధికారులపై తుపాకులతో దాడి చేసినా హత్యానేరం కేసు నమోదు చేయలేదంటే కేసు దర్యాప్తుపై విశ్వాసం సన్నగిల్లుతోందన్నారు.
ఘటన ప్రాంతంలో విమానం టికెట్లు, ఆధార్‌కార్డులు లభించినప్పటికీ సదరు వ్యక్తులను ఎందుకు అరెస్ట్ చేయడం లేదని ఆయన ప్రశ్నించారు. కేసులో నిందితుడైన టీఆర్‌ఎస్ నాయకుడు అక్బర్‌ఖాన్.. మంత్రి కేటీఆర్ కాన్వాయ్‌లో తిరుగుతున్నా పోలీసులు అతన్ని అరెస్ట్ చేయకపోవటం దారుణమన్నారు. ప్రభుత్వం వెంటనే సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణకు ఆదేశించాలని, లేని పక్షంలో తామే హైకోర్టు లేదా సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని కిషన్‌రెడ్డి హెచ్చరించారు. సమావేశంలో బీజేపీ నాయకులు వెంకట్‌రెడ్డి, పుష్పలీల పాల్గొన్నారు.