నాయినిని మంత్రివర్గం నుంచి తొలగించాలి: కిషన్‌రెడ్డి
నిజామాబాద్:
తెలంగాణపై కేసీఆర్‌కు ఏమాత్రం ప్రేమ ఉన్నా వెంటనే రాష్ట్ర హోం మంత్రి నాయిని నరసింహారెడ్డిని మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని బీజేపీ రాష్ట్ర నేత కిషన్‌రెడ్డి డిమాండ్ చేశారు. సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా బీజేపీ ఆధ్వర్యంలో సంకల్ప సభ జరిగింది. ఈ సభలో కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్‌సింగ్, కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ, జాతీయ నాయకుడు మురళీధర్‌రావు, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి మాట్లాడుతూ నిజామాబాద్ బీజేపీ సభను విచ్ఛిన్న సభగా నాయిని పేర్కొనడం దారుణమన్నారు. సెప్టెంబర్ 17 నాడు జాతీయ జెండా ఎగురవేయడం విచ్ఛిన్నమా అని ప్రశ్నించారు.
నిజామాబాద్ సంకల్ప సభలో ఎలా పాల్గొంటారని నాయిని కేంద్ర హోం మంత్రిని ఎలా ప్రశ్నిస్తారన్నారు. కేసీఆర్ మీరు జెండా ఎగురవేస్తారా లేదా లేకపోతే 2019 వరకూ వేచి చూస్తాం.. 2019లో బీజేపీ కార్యకర్త ముఖ్యమంత్రి అవుతారు.. అప్పుడు అధికారికంగా సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన ఉత్సవాలు చేస్తాం అని ఆయన స్పష్టం చేశారు. టీఆర్‌ఎస్ నేత డీఎస్ కుమారుడు ధర్మపురి అరవింద్, కాంగ్రెస్ నేత బస్వా లక్ష్మీనర్సయ్యలు ఈ సభలో రాజ్‌నాథ్ ఆధ్వర్యంలో బీజేపీలో చేరారు. వారికి రాజ్‌నాథ్‌సింగ్ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీ సీనియర్ నాయకుడు నాగం జనార్దన్‌రెడ్డి మాట్లాడుతూ కేసీఆర్ నిజాం వారసునిగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. బీజేపీ లేకపోతే తెలంగాణ వచ్చేదా అని ప్రశ్నించారు. కేసీఆర్ మూర్ఖుడంటూ ఆయన సెప్టెంబర్ 17ను అధికారికంగా జరపడు.. 2019లో బీజేపీదే అధికారం అని అన్నారు.