
కేంద్ర మంత్రిని కలిసిన మెదక్ ఎంపీ
సిద్దిపేట అర్బన్: కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి స్మృతి ఇరాణీని మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి మంగళవారం ఢిల్లీలో కలిశారు. ఈ సందర్భంగా సిద్దిపేట ప్రాంతానికి కేంద్రీయ విద్యాలయాన్ని మంజూరు చేయాలని కోరినట్లు ఎంపీ ‘సాక్షి’కి తెలిపారు. సిద్దిపేట పట్టణ శివారులో కేంద్రీయ విద్యాలయం కోసం స్థలాన్ని కూడా సేకరించిన విషయాన్ని కూడా మంత్రికి వివరించినట్లు ఎంపీ చెప్పారు.
విద్యారంగం అభివృద్ధి కోసం ఈ ప్రాంతంలో కేంద్రీయ విద్యాలయాన్ని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని ఎంపీ చెప్పారు. ఈ సందర్భంగా వినతి పత్రాన్ని అందజేసినట్లు వివరించారు. మంత్రి సానుకూలంగా స్పందించారని కేంద్రీయ విద్యాలయం మంజూరు చేసే అవకాశం ఉందని ఎంపీ తెలిపారు.