సాక్షి, హైదరాబాద్: కృష్ణా బోర్డు రాష్ట్రానికి కేటాయించిన 299 టీఎంసీల నీటిని సంపూర్ణంగా వినియోగంలోకి తెచ్చేందుకు అధికారులంతా కృషి చేయాలని నీటి పారుదల మంత్రి టి.హరీశ్‌రావు సూచించారు. నీటి సమర్థవంతంగా ఉపయోగించుకోవడంపై అధికారులు పక్కాగా ప్రణాళికలు రూపొందించుకోవాలని ఆదేశించారు. సోమవారం నాగార్జునసాగర్ కాల్వల ఆధునీకరణ పనులపై ప్రాజెక్టు డెరైక్టర్ మొదలుకొని, జూనియర్ ఇంజనీర్ స్థాయి వరకు అధికారులందరితోనూ మంత్రి సమీక్ష జరిపారు.
ఈ సమీక్షకు ప్రధాన కాల్వ, డిస్ట్రిబ్యూటరీలు, ఫీల్డ్ కెనాల్ పనులను చేస్తున్న కాంట్రాక్టర్లు సైతం హాజరయ్యారు. సాగర్ ఎడమ కాల్వ కింద చివరి ఆయకట్టు వరకూ నీరందించేలా కృషి చేయాలని, మనం చేసే ప్రయత్నం రైతుల ఆత్మహత్యల నివారణకు ఉపయోగపడుతుందని మంత్రి హరీశ్‌రావు తెలిపారు. జూలై 10వ తేదీలోగా కాల్వల్లో ఉన్న చెట్లు, మట్టి, కంకర గుట్టలు, అనవసర వ్యర్థాలను తొలగించాలని ఆదేశించారు. గత రబీలో రైతాంగానికి అవసరమైన నీటిని అందించగలిగామని, ఈ ఏడాది కూడా అదే పనితీరు కనబర్చాలని సూచించారు.
క్వార్టర్లలో విద్యుత్ పంపిణీపై సమీక్ష..
రాష్ట్రంలోని భారీ, మధ్యతరహా ప్రాజెక్టులకు చెందిన క్వార్టర్లలో గృహ విద్యుత్ పంపిణీ విధానంపై టీఎస్‌ఎస్‌పీడీసీఎల్ ఉన్నతాధికారులతోనూ మంత్రి హరీశ్‌రావు సమీక్షించారు. నల్లగొండ, ఖమ్మం జిల్లాల్లో ఉన్న సాగర్, ఎస్‌ఎల్‌బీసీ, ఏఎంఆర్‌పీ ప్రాజెక్టులకు చెందిన నివాస క్యాంపుల గృహ విద్యుత్ పంపిణీ విధానం మార్పుపై ముఖ్యంగా సమీక్ష జరిగింది. హైటెన్షన్ విద్యుత్ వాడకం వల్ల ప్రభుత్వానికి 40 ఏళ్లుగా తీవ్ర నష్టం జరుగుతున్న దృష్ట్యా వాటిని లోటెన్షన్ విద్యుత్‌లోకి మార్చి సరఫరా చేయాలని మంత్రి ఆదేశాలిచ్చారు. డిస్కంలకు క్యాంపు కాలనీలు బకాయిపడ్డ రూ.38.8 కోట్లను చెల్లించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు.
299 టీఎంసీలనూ వినియోగంలోకి తేవాలి
Published Tue, Jun 23 2015 3:33 AM | Last Updated on Sun, Sep 3 2017 4:11 AM
Advertisement
Advertisement