► వాటర్‌గ్రిడ్‌తో తరలిరానున్న జలాలు
► ప్రభుత్వానికి రూ.53 కోట్లతో ప్రతిపాదనలు
► ఇంటింటికీ నల్లా కనెక్షన్లు
తాండూరు : తాండూరుకు కృష్ణాజలాలు అందుబాటులోకి రానున్నాయి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వాటర్‌గ్రిడ్‌లో భాగంగా తాండూరువాసులకు కృష్ణాజలాలు అందనున్నాయి. దాంతో వచ్చే రెండు, మూడేళ్లలో అందరికీ ఫిల్టర్ వాటర్ అందుబాటులోకి రానున్నది. వాటర్ గ్రిడ్‌తో పైప్‌లైన్ ద్వారా శ్రీశైలం ప్రాజెక్టు బ్యాక్ వాటర్ సరఫరాకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా వాటర్‌గ్రిడ్ కోసం తాండూరు మున్సిపల్ అధికారులు సుమారు రూ.53కోట్ల నిధులకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు అందజేశారు.
శ్రీశైలం ప్రాజెక్టు నుంచి షాద్‌నగర్, పరిగి, యాలాల మీదుగా తాండూరు పట్టణానికి, ఇక్కడి నుంచి చివరి పాయింట్ పెద్దేముల్‌కు కృష్ణాజాలలు పైప్‌లైన్ ద్వారా సరఫరా (గ్రావిటీ) కానున్నాయి. పట్టణంలో 65వేలకుపైగా జనాభా ఉంది. ప్రస్తుతం మున్సిపాలిటీకి చెందిన ఆరు రిజర్వాయర్లు ద్వారా ప్రతి రోజు 6 ఎంఎల్‌డీ(మిలియన్ లీటర్స్ పర్ డే) తాగునీరు సరఫరా అవుతుంది. మొత్తం 14వేలకుపైగా గృహాలు ఉన్నాయి. ఇందులో 7వేల గృహాలకు మాత్రమే నల్లా కనెక్షన్‌లు ఉన్నాయి.
వాటర్‌గ్రిడ్ ద్వారా పట్టణ శివారులోని ఖాంజాపూర్ గుట్టపై 10లక్షల లీటర్ల సామర్థ్యం కలిగిన మాస్టర్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌ను నిర్మించనున్నారు. ఇక్కడనే ఒక సంపు కూడా నిర్మిస్తారు. శ్రీశైలం బ్యాక్‌వాటర్ ఖాంజాపూర్ గుట్టపై నిర్మించే బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌కు చేరతాయి. ప్రస్తుతం ఉన్న ఆరు రిజర్వాయర్లకు అదనంగా రెండు రిజర్వాయర్లు నిర్మించనున్నారు. ఖాంజాపూర్ గుట్ట సంపు నుంచి రిజర్వాయర్ల ద్వారా కృష్ణాజలాలు సరఫరా జరుగుతుంది.
6 ఎంఎల్‌డీ నుంచి 11ఎంఎల్‌డీకి తాగునీటి సామర్థ్యం పెరగనున్నది. దాంతోపాటు ఇంటింటికీ నల్లా కనెక్షన్‌లు ఇవ్వడానికి ఆస్కారం కలుగుతుంది. రెండు, మూడేళ్లలో వాటర్ గ్రిడ్ ద్వారా తాండూరుకు కృష్ణాజలాలు అందుబాటులోకి రానున్నట్టు చెబుతున్నారు. 15ఏళ్ల వరకు తాగునీటి సమస్య తలెత్తకుండా డిజైన్ చేసినట్టు తాండూరు మున్సిపల్ ఇంజనీర్ సత్యనారాయణ తెలిపారు.
తాండూరుకు కృష్ణమ్మ!
Published Wed, Apr 22 2015 12:53 AM | Last Updated on Wed, Aug 29 2018 9:29 PM
Advertisement
Advertisement