సాక్షి, సిరిసిల్ల : తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన రైతు బంధు పథకం, పాస్ పుస్తకాల పంపిణిలో రాజన్న సిరిసిల్ల జిల్లా నంబర్‌వన్ స్థానంలో నిలిచిందని మంత్రి కేటీఆర్ అన్నారు. బుధవారం సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం నామపూర్‌లో జరిగిన సభలో మంత్రి మాట్లాడుతూ... రాష్ట్రంలో ప్రతి రైతు ముఖంలో ఆనందాన్ని చూసి ప్రతిపక్షాలు గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయన్నారు. ఈ సందర్భంగా ఆయన జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్‌ను, రెవెన్యూ, వ్యవసాయ అధికారులను అభినందించారు. వచ్చే వేసంగి పంటకు సాగు భుములకు గోదావరి జలాలు అందేలా చూస్తామన్నారు.
దేశంలోనే ఎక్కడాలేని విధంగా అన్ని వర్గాలకు 24 గంటలు కరెంట్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని కేటీఆర్ స్పష్టం చేశారు. రైతు బంధు పథకం ద్వారా ఇస్తున్నపంట సాయం, ప్రతి పైసా రైతుకు చేరేలా చుస్తామని, మిషన్ కాకతీయ ద్వారా రాష్ట్రంలో ఉన్న 46 వేల చెరువులను నింపేందుకు కృషి చేస్తున్నమని తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో నాలుగేళ్ల క్రితం వరకు రైతులను ఎవరు పట్టించుకోలేదని మండిపడ్డారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ రైతుబిడ్డ కాబట్టే రైతుల గురించి ఆలోచన చేస్తున్నారని అన్నారు. రైతుల కోసం రుణమాఫీ చేసిన కార్యక్రమం పూర్తయిన తర్వాత ఏడాది క్రితమే కేసీఆర్ పెట్టుబడి సాయం కోసం ప్రకటన చేశారని ఆయన గుర్తు చేశారు. ఇది ఎన్నికల కోసం ఏమాత్రం కాదని పేర్కొన్నారు. 86 ఏళ్ల తర్వాత భూ రికార్డుల ప్రక్షాళన చేసి 60 లక్షల మంది రైతులకు కొత్త పట్టాలు, పాసుపుస్తకాలు ఇస్తున్న నాయకుడు సీఎం కేసీఆర్ మాత్రమేనని వ్యాఖ్యానించారు.
గత ప్రభుత్వం రూ. 200 పింఛను ఇచ్చేందుకు కోసం ఎన్నో ఇబ్బందులు పెట్టిందని, కానీ తెలంగాణ ప్రభుత్వం రూ. వెయ్యి ఇస్తుందన్నారు. రైతు బంధు ద్వారా కేసీఆర్ రైతులకు ఆత్మ బంధవుగా మారారన్నారు. వ్యవసాయానికి ఉపాధి హామీ పథకాన్ని అనుసంధానం చేసే విధంగా కేంద్రం నిర్ణయం తీసుకోవాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment