మధ్య మానేరు జలాశయం బ్యాక్ వాటర్ (ఫైల్)
సిరిసిల్ల: దేశ భవిష్యత్‌కు బాటలు వేస్తూ.. పాలనా విభాగానికి ప్రాణం పోసే ఇండియన్ అడ్మినిస్ట్రేషన్ సర్వీస్ (ఐఏఎస్)కు ఎంపికైన అధికారులకు శిక్షణనిచ్చే ముస్సోరీలోని లాల్ బహదూర్‌శాస్త్రి అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్‌కు సిరిసిల్ల ‘జలసంరక్షణ’పాఠ్యాంశమైంది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో గత ఆరేళ్లుగా చేపట్టిన నీటి నిర్వహణ పద్ధతి ఇప్పుడు దేశానికి ఆదర్శంగా మారింది. జిల్లా లో భూగర్భ జలాలు గణనీయంగా వృద్ధి చెందడమే ఇందుకు కారణం. కరువు కోరల్లో చిక్కిన ఈ జిల్లాలో ఇప్పుడు భూగర్భ జలాల మట్టం ఆరు మీటర్లకు పెరగడం విశేషం.
కరువు నుంచి జలసిరుల వైపు..
రాజన్న సిరిసిల్ల జిల్లా మెట్ట ప్రాంతం. సముద్ర మట్టానికి సుమారు 1,250 అడుగుల ఎత్తులో ఉంటుంది. ఒకప్పుడు ఎండిపోయిన వాగులు, చెరువులు.. చుక్క నీరివ్వని బోర్లు.. బీళ్లుగా మారిన పంట భూములు.. వెరసి ముంబై, దుబాయ్‌లకు వలసలు. ఇదీ రాజన్న సిరిసిల్ల జిల్లా దుస్థితి. కానీ ఇప్పుడు జలసిరులు పొంగుతున్నాయి. మధ్యమానేరు జలాశయానికి గోదావరి జలాలు చేరా యి. ఎల్లంపల్లి ద్వారా వచ్చిన నీటితో సాగునీటి వనరుల్లో నీరు చేరింది. గతేడాది సమృద్ధిగా వర్షాలు పడటంతో భూగర్భ జలాలు బాగా అభివృద్ధి చెందాయి. జిల్లాలో 6 మీట ర్ల లోతుల్లోనే నీటి ఊటలు ఉండటం విశేషం.
యువ ఐఏఎస్‌ల శిక్షణకు ఎంపిక..
ఐఏఎస్‌కు ఎంపికైన అధికారులకు వివిధ అంశాలపై ముస్సోరీలో శిక్షణ ఇస్తారు. జాతీయ, అంతర్జాతీయ, స్థానిక అంశాలపై ఆదర్శ విధానాలు, పాలనాపరమైన సంస్కరణలపై ఇందులో చర్చిస్తారు. ఈసారి రాజన్న సిరిసిల్ల జిల్లాలో చేపట్టిన జల నిర్వహణ ఎంపికైంది. ఇక్కడ గత ఆరేళ్లుగా చేపడుతున్న నీటి నిర్వహణ పనులు సత్ఫలితాలు ఇచ్చాయని గుర్తించారు. ఈ నేపథ్యంలో ముస్సోరీ అకాడమీ సిరిసిల్ల జిల్లాలో చేసిన పనులను డాక్యుమెంట్ రూపంలో అందించాలని ఇక్కడి అధికారులను కోరింది.
కలెక్టర్‌తో మాట్లాడిన అధికారులు..
కలెక్టర్ కృష్ణభాస్కర్‌తో అకాడమీ అధికారులు ఫోన్‌లో మాట్లాడారు. జిల్లాలో చేపట్టిన వాటర్ మేనేజ్‌మెంట్ పనుల వివరాల ను అడిగి తెలుసుకున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మధ్యమానేరు జలాశయం, పునరావాస అంశాలపై సమగ్రంగా తెలుసుకున్నారు. జిల్లాలో పర్యటిం చేందుకు పలువురు శిక్షణలో ఉన్న ఐఏఎస్ అధికారులు ఆసక్తితో ఉన్నట్లు తెలిపారు.
ఆనందంగా ఉంది
జాతీయస్థాయిలో రాజన్న సిరిసిల్ల జిల్లాకు గుర్తింపు రావడం ఆనందంగా ఉంది. తెలంగాణ జల విధానాన్ని సీఎం కేసీఆర్ సమర్థవంతంగా అమలు చేశారు. బీళ్లకు గోదావరి జలాలను కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా తీసుకురావడం విశేషం. జిల్లాకు సాగునీటి ఫలాలు అందాయి. దీంతో భూగర్భ జలాలు బాగా పెరిగాయి. శిక్షణ ఐఏఎస్‌లకు సిరిసిల్ల జల సంరక్షణ పాఠ్యాంశం కావడం సంతోషంగా ఉంది. –కె.తారక రామారావు, రాష్ట్రమంత్రి
Comments
Please login to add a commentAdd a comment