కేటీఆర్ సూచనతో నిత్యవసరాలందిస్తున్న అధికారులు
నేరేడ్‌మెట్ (హైదరాబాద్): లాక్‌డౌన్ నేపథ్యంలో బిజీగా ఉన్నప్పటికీ ట్విట్టర్‌లో వివిధ సమస్యలు, ప్రజల ఇబ్బందులపై వస్తున్న మేసేజ్‌లకు వెంటనే స్పందిస్తూ పరిష్కారానికి చొరవ చూపుతున్నారు రాష్ట్ర మంత్రి కేటీఆర్. ఇందులో భాగంగా అనారోగ్యంతో బాధపడుతున్న తమ కొడుకుకు మందులు కొనుగోలు చేయలేక ఇబ్బంది పడుతున్నామని..ఆదుకోవాలని ఓ పేద దంపతులు ట్విట్టర్‌లో పంపిన మేసేజ్‌కు కేటీఆర్ స్పందించారు. వివరాల్లోకి వెళితే..వినాయకనగర్‌లో నివాసం ఉంటున్న శ్రావణి, ప్రవీణ్‌లకు ముగ్గురు సంతానం. ప్రవీణ్ డ్రైవర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఆమె కూలి పనులు చేస్తుంది. ముగ్గురు సంతానంలో పెద్ద కొడుకు ప్రణీత్(8) కొంతకాలం క్రితం నీటిసంపులో పడి బ్రెయిన్, ఊపిరితిత్తులు దెబ్బతిని, అంగవైకల్యంతో బాధపడుతున్నాడు. వైద్యులు సూచించిన ప్రకారం తల్లిదండ్రులు మందులు వాడుతూ వస్తున్నారు. ఇటీవల మందులు అయిపోయాయి. ఈ క్రమంలో లాక్‌డౌన్ అమల్లోకి వచ్చింది.
తల్లిదండ్రులు ఇంటికే పరిమితమయ్యారు. పని లేకపోవడంతో కొడుకుకు మందులు, నిత్యావసర సరుకులు కొనడానికి చేతిలో డబ్బులు లేని దయనీయ పరిస్థితి. దాంతో తమ సమస్యను తెలిసిన వారి ద్వారా వారం రోజుల క్రితం మంత్రి కేటీఆర్‌కు పేద దంపతులు ట్వీట్ చేయించారు. ఈ ట్వీట్‌కు స్పందించిన కేటీఆర్ వెంటనే ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని, మేడ్చల్ జిల్లా కలెక్టర్‌కు సూచించారు. కలెక్టర్ మల్కాజిగిరి తహసీల్దార్ బి.గీతకు సమాచారం ఇచ్చారు. తహసీల్దార్ గీత ఆ పేద దంపతులను శనివారం నేరేడ్‌మెట్‌లోని తన కార్యాలయానికి పిలిపించారు. కావాల్సిన నిత్యావసర సరుకులను తహసీల్దార్, ప్రణీత్‌కు అవసరమైన మందులను నేరేడ్‌మెట్ ఆఫీసర్స్ కాలనీకి చెందిన గోపు రమణారెడ్డి అందజేశారు. తమ సమస్యపై స్పందించిన కేటీఆర్‌తోపాటు కలెక్టర్, తహసీల్దార్, రమణారెడ్డిలకు పేద దంపతులు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment