మధ్య నుంచే వెనుదిరిగిన కేటీఆర్
ప్రొటోకాల్ వివాదమే కారణమా?
సాక్షి, కామారెడ్డి: జిల్లా కేంద్రంలో మున్సిపల్ కార్యాలయ నూతన భవన ప్రారంభంతోపాటు ఇతర అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనడానికి కామారెడ్డికి బయలుదేరిన మున్సిపల్ శాఖ మంత్రి కె. తారకరామారావు మధ్యలోంచే వెనుదిరిగారు. ప్రొటోకాల్ వివా దం కారణంగానే మంత్రి పర్యటన అర్ధంతరంగా రద్దు అయిందని భావిస్తున్నారు. కామారెడ్డి మున్సిపల్ నూతన కార్యాలయ భవనం ప్రారంభంతోపాటు మిషన్ భగీరథ పనుల శంకుస్థాపన కార్యక్రమాల్లో పాల్గొనడానికి మంత్రి కేటీఆర్ బుధవారం కామారెడ్డికి రావాల్సి ఉంది.
ఈ మేరకు ఉదయం మంత్రి హైదరాబాద్ నుంచి బయలుదేరారని తెలియడంతో ఆయనకు స్వాగతం పలికేందుకు నేత లంతా పట్టణ శివారు ప్రాంతానికి చేరారు. అయితే, మెదక్ జిల్లాలోని తూప్రాన్ వరకు వచ్చిన ఆయన వెనుదిరిగి వెళ్లారని తెలియడంతో నాయకులు, కార్యకర్తలు నిరుత్సాహానికి గురయ్యా రు. దీంతో మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి, ఎంపీ బీబీ పాటిల్, ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ ఆయా కార్యక్రమాలను నిర్వహించారు.
మున్సిపల్ కార్యా లయ ప్రారంభోత్సవం విషయంలో ప్రొటోకాల్ పాటించడం లేదని, శిలాఫలకాల్లో మండలి ప్రతిపక్ష నేత షబ్బీర్ అలీ పేరును నిబంధనలకు విరుద్ధంగా కింద రాయించారని పేర్కొంటూ కాంగ్రెస్ పార్టీకి చెందిన కౌన్సిలర్లు కలెక్టర్‌కు, మున్సిపల్ డైరెక్టరేట్‌కు ఫిర్యాదు చేశారు. ఇదే విషయమై ప్రభుత్వ పెద్దలకు, ఉన్నతాధికారులకు కూడా ఫిర్యాదులు వెళ్లాయని తెలుస్తోంది. అయినా వీటన్నింటినీ పక్కనపెట్టి మంత్రి కేటీఆర్ కామారెడ్డి పర్యటనకు బయలుదేరి వచ్చారు. సీఎం నుంచి ఫోన్ కాల్ రావడంతో ఆయన మధ్యలోనే వెనుదిరిగి వెళ్లినట్లు తెలుస్తోంది. స్థానికంగా మాత్రం ప్రొటోకాల్ వివాదం తలెత్తుతుందన్న ఉద్దేశంతోనే మంత్రి వెనుదిరిగి వెళ్లారని ప్రచారం జరుగుతోంది.