
చంద్రబాబువి కుళ్లురాజకీయాలు
- కరెంట్ అడిగితే కాల్చి చంపిన ఘనత ఆయనదే
- ఏపీ అసెంబ్లీలో ప్రతిపక్షాన్ని తొక్కేస్తున్నారు
- మంత్రి హరీశ్‌రావు ఫైర్
మెదక్: ‘కుళ్లు రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్ ఏపీ సీఎం చంద్రబాబునాయుడు. కరెంట్ అడిగితే.. రైతులను కాల్చిన చంపిన ఘనత టీడీపీ ప్రభుత్వానిదే’నని నీటిపారుదల శాఖ మంత్రి టి.హరీశ్‌రావు అన్నారు. ఆదివారం సాయంత్రం మెదక్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆంధ్రా అసెంబ్లీలో ప్రతిపక్షం లేకుండానే ఏకపక్షంగా సభను నడుపుతున్న చంద్రబాబు ప్రభుత్వ నిరంకుశ పాలనకు నిదర్శనమని చెప్పారు.
టీడీపీ ఎమ్మెల్యేలను టీఆర్‌ఎస్‌లో చేర్చుకుంటున్నారని విమర్శలు చేస్తున్న బాబు.. ఏపీలో వైఎస్సార్ సీపీ ఎంపీలు, ఎమ్మెల్సీలను టీడీపీలో చేర్చుకోవడం లేదా? అని ప్రశ్నించారు. తెలంగాణ అసెంబ్లీలో జాతీయ పతాకాన్ని అవమాన పర్చినందుకే టీడీపీ సభ్యులను సస్పెండ్ చేశామన్నారు. ఎర్రబెల్లి దయాకర్‌రావుకు దమ్ముంటే ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాలను తెలంగాణకు తిరిగి ఇవ్వాలని, హైకోర్టు విభజనపై చంద్రబాబు వైఖరిని కోరుతూ లేఖ రాయాలని డిమాండ్ చేశారు.
త్వరలో 800 ఇంజినీర్ల నియామకం
మునిసిపల్ వ్యవస్థలో సమూల మార్పులు తీసుకురానున్నట్టు హరీశ్‌రావు తెలిపారు. ఇందుకుగాను 800 మంది మునిసిపల్ ఇంజినీర్లను త్వరలో నియమించనున్నట్టు చెప్పారు. ఆదివారం సాయంత్రం మెదక్ ఖిల్లాపై మునిసిపల్ కౌన్సిల్ సభ్యులు, అధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇప్పటివరకు నాలుగు జిల్లాలకు ఒక మున్సిపల్ ఎస్‌ఈ ఉండేవారని, ఇకముందు రెండు జిల్లాలకు ఒక ఎస్‌ఈని నియమిస్తామన్నారు. జిల్లాకో పబ్లిక్ హెల్త్ ఆఫీసర్‌ను నియమిస్తామని చెప్పారు. వావ్ పద్ధతి కింద ఐటీసీ సౌజన్యంతో తడి చెత్త, పొడి చెత్తను వేరు చేయనున్నట్టు తెలిపారు.పారిశుద్ధ్య సిబ్బంది నేరుగా ఇంటింటికి వెళ్లి తడి, పొడి చెత్తలను వేర్వేరుగా సేకరిస్తారని తెలిపారు.
బీడీ కార్మికులందరికీ పింఛన్లు ఇవ్వలేం..
చేగుంట: బీడీ కార్మికులందరికీ పింఛన్లు అందించలేమని మంత్రి హరీశ్ స్పష్టం చేశారు. చేగుంట మండలం రెడ్డిపల్లిలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. గ్రామాల్లో 10 శాతం ఉండి, పీఎఫ్ కలిగిన బీడీ కార్మికులందరికీ పింఛన్లు అందిస్తామన్నారు. ప్రస్తుతం అర్హుల ఎంపిక ప్రక్రియ కొనసాగుతోందని, వారందరికీ జీవనభృతి చెల్లిస్తామన్నారు.