‘ఆమె’ కీలకం  | Ladies Voters More Than Gents Voters in Adilabad Loksabha Constituency | Sakshi
Sakshi News home page

‘ఆమె’ కీలకం 

Published Thu, Apr 11 2019 2:14 PM | Last Updated on Thu, Apr 11 2019 2:15 PM

Ladies Voters More Than Gents Voters in Adilabad Loksabha Constituency - Sakshi

ఓటు వేసినట్లు చూపిస్తున్న మహిళలు (ఫైల్‌)

బజార్‌హత్నూర్‌(బోథ్‌): 17వ లోక్‌సభ ఎన్నికలు దేశవ్యాప్తంగా ప్రాధాన్యత సంతరించుకున్నాయి. జాతీయ పార్టీలుగా సుదీర్ఘ కాలంగా పాలించిన కాంగ్రెస్, బీజేపీతో ప్రాంతీయ పార్టీల మధ్య ఆసక్తికర పోరు నెలకొంది. రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ లోక్‌సభ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. 17 లోక్‌సభ స్థానాలకు గాను 16 స్థానాలు గెలుపొందేందుకు ముమ్మర ప్రచారంతో హోరెత్తించగా.. బీజేపీ, కాంగ్రెస్‌లు కూడా తమ ప్రచార పర్వం ఉధృతంగానే కొనసాగించాయి. ఆదిలాబాద్‌ పార్లమెంట్‌ నియోజకవర్గ పరిధిలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు (ఖానాపూర్, సిర్పూర్, నిర్మల్, ఆసిఫాబాద్, ఆదిలాబాద్, బోథ్, ముథోల్‌) ఉన్నాయి. 

అతివలే అంతిమ నిర్ణేతలు 

పోలింగ్‌ గడువు సమీపిస్తున్న కొద్ది ప్రధాన రాజకీయ పార్టీలు నువ్వా,నేనా అన్నట్లు రీతిలో ప్రచా రం చేపట్టాయి. ఆదిలాబాద్‌ పార్లమెంట్‌ స్థానం పరిధిలో సిర్పూర్‌ మినహా మిగతా ఆరు నియోజకవర్గాలల్లో పురుషులతో పోల్చితే మహిళ ఓటర్లే అధికం. సహజంగానే పోలింగ్‌ సరళిలో పురుషులతో పోల్చితే మహిళలే ఉత్సహంగా పాల్గొంటారన్నది గత అనుభావాలు సూచిస్తుండటంతో ప్రస్తుత ఎన్నికల్లోనూ మహిళలదే కీలక పాత్ర కాబోతోంది. అంతే కాదు కొత్తగా 38,588 మంది ఓటర్లుగా నమోదైన యువత కూడా అభ్యర్థుల గెలుపోటమిలో కీలకపాత్ర పోషించే అవకాశం ఉంది. 

ఏడు నియోజకవర్గాల్లో 7,58,064 మంది మహిళా ఓటర్లు 

ఆదిలాబాద్‌ పార్లమెంట్‌ స్థానం పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను మొత్తం 14,88,353 మంది ఓటర్లు ఉండగా ఇందులో 7,30,233 మంది పురుష ఓటర్లు, 7,58,064 మంది మహిళా ఓటర్లు, ఇతరులు 56 మంది ఉన్నారు. ఈ ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలలో సిర్పూర్‌ మినహా పురుష ఓటర్లతో పోల్చితే మహిళా ఓటర్లే అధికం. సిర్పూర్‌ నియోజకవర్గంలో మహిళా ఓటర్లతో పోల్చితే పురుష ఓటర్లు 1574మంది అధికంగా ఉన్నారు. మిగతా ఆరు నియోజక వర్గాలలో మహిళా ఓటర్లే అధికం. ఖానాపూర్‌లో 3,763, నిర్మల్‌ 13,396, ఆసిఫాబాద్‌ 135, ఆదిలాబాద్‌ 2437, బోథ్‌ 3896, ముథోల్‌ 5676, మొత్తం 27,381 మంది మహిళలు అధికంగా ఉండటంతో ఎంపీ అభ్యర్థుల గెలుపోటమి వీరిపైనే ఆధారపడి ఉంది.

 ప్రసన్నం చేసుకునే పనిలో పార్టీలు 

లోక్‌సభ అభ్యర్థికి మహిళల ఓట్లు కీలకం కావడంతో వారిని ప్రసన్నం చేసుకునే పనిలో ప్రధాన రాజకీయ పార్టీలున్నాయి. బీజేపీ, కాంగ్రెస్, టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు పోటాపోటీగా ప్రచారం చేస్తూ మా ప్రభుత్వం వస్తే, మా అభ్యర్థి గెలిస్తే మహిళలకు ప్రాధాన్యత ఇచ్చే పథకాలు ప్రవేశపెడుతామని హామీలిస్తూ మహిళలను కలుసుకుని ఓట్లు వేయాలని కోరారు. గ్రామస్థాయిలో సర్పంచులుగా మహిళల ప్రాతినిధ్యం పెరిగినందున అందులో అధికార టీఆర్‌ఎస్‌ పార్టీకి సంబంధించిన మహిళా సర్పంచులు అధికంగా ఉండటంతో వారికి ప్రచార బాధ్యతలు అప్పగించారు.

రాబోయే ఐదేళ్ల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని టీఆర్‌ఎస్‌కు ఓటు వేస్తే మహిళలకు మరింత లబ్ధి చేకూరుతుందని ఆ పార్టీ నాయకులు ప్రచారం చేశారు. బీజేపీ ముస్లిం మహిళలకు తలాక్‌ రద్దు, గ్రామీణ ప్రాంతాల్లో మహిళల పరువు కాపాడుటతో పాటు స్వచ్ఛభారత్‌ ద్వారా మరుగుదొడ్ల నిర్మాణం చేపట్టినట్లు ప్రచారం చేసింది. ఇక కాంగ్రెస్‌ మహిళలకు ప్రత్యేక పథకాలు ఉంటాయని భరోసా కల్పిస్తూ ప్రచారం హోరెత్తించాయి. మరి ఈ ఎన్నికల్లో మహిళలు ఎటువైపు మొగ్గుచూపుతారోనన్న ఉత్కంఠ సర్వత్రా చోటు చేసుకుంది.   

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement