
ఖైరతాబాద్: నగరంలో గురువారం ‘లక్డీకాపూల్ వంతెన’ ప్రారంభం కానుంది. లక్డీకాపూల్ చౌరస్తాలో ఎంతో ఆకర్షణీయంగా నిర్మించిన ఈ వంతెనను గురువారం మేయర్ రామ్మోహన్, మంత్రులు, ఎమ్మెల్యేలు తదితర ప్రజాప్రతినిధుల సమక్షంలో ప్రారంభించనున్నారు. ఇంతకీ ఈ లక్డీకాపూల్ చరిత్ర ఏంటంటే...నగరంలో సెంటర్ ఆఫ్‌ద సిటీగా లక్డీకాపూల్‌కు ప్రత్యేకత ఉంది. ఇబ్రహీం కుతుబ్‌షా కాలంలో ఆయన కూతురు ప్రతిరోజు నౌబత్ పహాడ్‌లో ఉన్న గురువు వద్దకు వెళ్లేందుకు ఈ దారిలో ఉన్న కాలువ దాటి వెళ్లాల్సిన పరిస్థితి. దీంతో అప్పట్లో కాలువ దాటేందుకు వీలుగా కర్రలతో వంతెనను ఏర్పాటుచేశారు.
హిందీలో అమ్మాయిని లడికీ అంటారు కాబట్టి లడికీ కోసం ఏర్పాటుచేసిన ఈ వంతెనను ‘లడికీకా పూల్’ అని, ఆ తరువాత కాలక్రమేణా ఆ ప్రాంతం లక్డీకాపూల్‌గా ప్రాచుర్యం పొందింది. 1761, మే నెలలో కర్రల వంతెనను ఏర్పాటుచేశారు. 250 సంవత్సరాలకు పైబడిన ఈ కర్రల వంతెన కింద నుంచి నాంపల్లిని కనెక్ట్ చేస్తూ నిజాం హయాంలో రైల్వేలైన్ వేశారు. దశాబ్ధ కాలం వరకు కూడా లక్డీకాపూల్‌లో కర్రల వంతెన ఉండేదని, ఆ వంతెన దాటి వెళ్ళి చుట్టుప్రక్కల ప్రాంతాల్లో రేగుపళ్లు తెచ్చుకునేవారమని ఖైరతాబాద్ ప్రాంత వాసులు చెబుతున్నారు.
అలా అమ్మాయి కాలువ దాటేందుకు వేసిన కర్రల వంతెనతోనే ఆ ప్రాంతానికి లక్డీకాపూల్‌గా పేరు ప్రాచుర్యంలోకి వచ్చింది. ఇప్పటికీ చాలా మంది లడికీకాపూల్‌గా చెప్తుండటమే ఇందుకు ఉదాహరణ. ఇటీవల గ్రేటర్ హైదరాబాద్‌లో జంక్షన్ల సుందరీకరణలో భాగంగా లక్డీకాపూల్‌లో నిర్మించిన లక్డీకాపూల్ పేరుకు చిహ్నంగా అప్పట్లో ఏర్పాటుచేసిన కర్రల వంతెనను గుర్తుచేస్తూ ఏర్పాటుచేసిన నమూనాను గురువారం నగర మేయర్ ప్రారంభించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment